ఉప్పల్, మార్చి 24: హైదరాబాద్‌లోని హబ్సిగూడ సిగ్నల్ (Habsiguda) ప్రమాదాలకు వేదికగా మారింది. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరగడం దీనికి సంకేతం. సోమవారం ఉదయం హబ్సిగూడ సిగ్నల్ వద్ద బీభత్సం సృష్టించింది. డీసీఎం బ్రేక్ ఫెయిల్ కావడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.
బైక్‌పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని దవాఖానకు తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.