ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 31: ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా డాక్టర్ జి.నాగయ్య యాంఫీ థియేటర్ నిర్మాణానికి అధికారులు శనివారం శంకుస్థాపన చేశారు. ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో నిర్మించనున్న ఈ థియేటర్‌ను రూ. 60 లక్షలతో నిర్మించనున్నారు. సుమారు 3 వేల మంది సామర్థ్యంతో నిర్మించేందుకు అయ్యే వ్యయాన్ని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ జి.నాగయ్య విరాళంగా అందజేస్తున్నారు. డాక్టర్ నాగయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగయ్య మాట్లాడుతూ తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న ఉస్మానియా యూనివర్సిటీకి తిరిగి ఏదైనా చేయాలనే సంకల్పంతో యాంఫీ థియేటర్‌ను నిర్మించేందుకు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కలిసి రావాలని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, హెచ్‌సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, ఈసీ సభ్యుడు డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, సిద్ధార్థ గ్రూపు విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.