మాదన్నపేట, సెప్టెంబర్ 21: వడ్డీ వ్యాపారుల చేతిలో దెబ్బలు తిన్న ఓ మాజీ హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రూపేశ్ వివరాలను వెల్లడించారు. భానునగర్‌లో నివాసముండే రిజ్వాన్ (32) మాజీ హోంగార్డు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డీలర్ నయీముద్దీన్ (54) వద్ద రూ.33 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సకాలంలో తిరిగి చెల్లించలేదు. దీంతో నయీముద్దీన్ ఇటీవల టోలీచౌకి ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సలీం(40), పాతనేరస్తుడైన అతడి మేనల్లుడు ఖాజా అలియాస్ చోర్ ఫరీద్ (24)ను కలిసి.. డబ్బులు వసూలు చేసి ఇవ్వాలని సహాయం కోరాడు. ఈ నెల 11న సంతోష్‌నగర్‌లో ఉన్న రిజ్వాన్ ఇంటికి వచ్చిన సలీం.. మాట్లాడాలని చెప్పి బజార్‌ఘాట్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్దకు తీసుకువెళ్లాడు. సలీంతో పాటు మరికొంత మంది కలిసి రిజ్వాన్‌ను చిత్రహింసలు పెట్టి గాయపరిచారు.
అనంతరం రిజ్వాన్ తండ్రికి ఫోన్‌చేసి, రెండు లక్షలు చెల్లించి కుమారుడిని తీసుకెళ్లాలని సూచించారు. గాయాలతో ఉన్న రిజ్వాన్‌ను ఈ నెల 16న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ 18వ తేదీన మృతి చెందాడు. తన కుమారుడిని వడ్డీ వ్యాపారులు చక్రవడ్డీ చెల్లించాలని బెదిరించారని, కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం వల్లే ఆరోగ్యం దెబ్బతిని చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 8 మంది పాత నేరస్తులతో పాటు వడ్డీ వ్యాపారులను కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.