Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రతపై నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వెంటవెంటనే జరుగుతున్న దాడులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికులు, ఇతర రాష్ర్టాలకు చెందిన మహిళలతో పాటు విదేశీయులను సైతం పోకిరీలు, కామాంధులు వదలడం లేదు. రోడ్లపై జులాయిగా తిరిగే వారు మహిళలు ఒంటరిగా కన్పిస్తే చాలు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున, శివారులలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతుండడంతో షీ టీమ్స్ ఎక్కడ అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జర్మనీకి చెందిన యువతిని కారులో బెదిరించి ఆ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కారులో ఐదుగురు మైనర్లతో పాటు బాధితురాలి స్నేహితుడిని కూడా వెంటబెట్టుకొని వెళ్లిన కామాంధుడు వాళ్లందరిని రోడ్డుపై వదిలేసి, బాధితురాలిని నిర్జన ప్రదేశానికి తీసికెళ్లి కారులో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్‌మీడియాలో హైదరాబాద్‌లో దిగజారుతున్న శాంతి భద్రతలపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌లో వెళ్తున్న యువతిపై లైంగిక దాడి యత్నం జరగడంతో బాధితురాలు కామాంధుడి నుంచి తప్పించుకోవడానికి రైల్లో నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యింది. అంతకు ముందు మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో బాలీవుడ్ నటిపై దాడి జరిగడం ఆందోళన కల్గిస్తోంది.
పెరుగుతున్న హత్యలు.. లైంగికదాడులు
హైదరాబాద్‌లో ఒక పక్క హత్యలు.. మరో పక్క లైంగిక దాడులు పెరుగుతుండడంతో శాంతి భద్రతలు ప్రశ్నార్ధకంలో పడుతున్నాయి. చీమ చిటుక్కుమన్నా తెలిసే టెక్నాలజీ ఉన్నా పోలీసులు మాత్రం వరుస ఘటనలను నిలువరించలేకపోతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్ సరిగ్గా లేకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాలలోనూ కామాంధులు రెచ్చిపోవడం ఆందోళన కల్గిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌కు దేశ విదేశాలతో పాటు ఆయా రాష్ర్టాలు, జిల్లాల నుంచి ప్రతి నిత్యం వేలాది మంది టూరిస్ట్‌లు వచ్చిపోతున్నారు. అలాంటిది ఇలాంటి ఘటనలు జరిగితే హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలు పకడ్బందీగా ఉండేలా పోలీసులు సరైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.