Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మరిన్ని హంగులను సమకూర్చుతుందని భావించిన గ్రేటర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మొండి ‘చెయ్యి’ చూపించింది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ వంటి రెండో దశ కీలక
ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మెట్రో విస్తరణ ఊసే లేదు.
పురపాలక శాఖ మొత్తానికి రూ.11,692 కోట్లను కేటాయించగా..హైదరాబాద్ అభివృద్ధిలో కీలక శాఖలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో, జలమండలికి సంబంధించి కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్టులకు రూ. 3600కోట్లు, జలమండలి రూ. 5595 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో మూసీ అభివృద్ధికి మాత్రమే రూ. 1000 కోట్లు కేటాయించారు. ఇక మెట్రో విస్తరణపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. ప్రజోపయోగంగా మెట్రోను తీర్చిదిద్దుతామంటూ తెరమీదకు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలను పక్కన పెట్టారు.