సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 ( నమస్తే తెలంగాణ ): అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుందర్రావు హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్లో ఒకటైన తాజ్‌మహల్ హోటల్లో పప్పులో పురుగు కనిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో జీహెచ్ఎంసీ పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారని హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు.
తనిఖీల్లో భాగంగా హోటల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, ఆహారపదార్థాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ఆహార పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్‌పై లేబుల్స్ లేకపోవడం, నిల్వ చేసే ప్రదేశంలో బొద్దింకలు ఉండటం వంటి అనేక లోపాలను ఆహార భద్రత అధికారులు గమనించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులను సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశామని, సంజాయిషీ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సైఫాబాద్‌లోని ది నిజాం క్లబ్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. శుభ్రత, ఆహార నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడమే కాదు.. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగది ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీల్లో తేలింది. ఆర్వో ప్లాంట్‌లో నిబంధనల ఉల్లంఘన, వంటగది ప్రాంగణంలో బొద్దింకలు తిరుగుతుండటం, పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతున్నట్లు గుర్తించారు. ఫ్రిజ్ డోర్లు విరిగిపోవడం, రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు.
వంటగది లోపల సింథటిక్ ఫుడ్ కలర్స్, డస్ట్ బిన్లకు మూతలు లేవని తేల్చి.. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అలాగే, అబిడ్స్ (ఎల్బీ స్టేడియం) ది ఫతే మైదాన్ క్లబ్‌లోనూ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. వంటగది లోపల పనిచేసే ఫుడ్ హ్యాండర్లకు హెయిర్ క్యాపులు, అప్రాన్లు, చేతి గ్లౌజ్‌లు లేకుండా ఉండటం, కొన్ని చోట్ల గోడలు జిడ్డుగా, నేల అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన వస్తువులు, ఆహార ప్యాకెట్లకు లేబుల్స్ సరిగా లేకపోవడం, డస్ట్బిన్లకు సరైన మూతలు లేకుండా ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు.