Juice Centers | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ): జ్యూస్ ఆరోగ్యకర పానీయం.. యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, అంథోసైనిన్లు అధికంగా ఉండటం వలన ఇది ఆరోగ్యకమైన పానీ యంగా పరిగణించబడుతుంది. ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్న ఈ జ్యూస్‌లను చాలా మంది రోడ్ల వెంట ఉండే జ్యూస్ బండ్ల దగ్గర, కాలనీల్లో జ్యూస్ సెంటర్ల వద్ద ఇష్టంగా తీసుకుంటుంటారు. దీనిని అసరాగా చేసుకుంటున్న కొందరు జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ఆర్యోగ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి అపరిశుభ్రమైన వాతావరణం, కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు సిద్ధం చేస్తున్నారు. జ్యూస్‌లో వినియోగించే పాలు, ఐస్‌లు ప్రమాదకరంగా ఉంటున్నాయి.
ఆమీర్‌పేట కేంద్రంగా పలు జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించగా కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏ ఒక్క సెంటర్ నిర్వాహకులు పరిశుభ్రత లేకుండా జ్యూస్‌లను కస్టమర్లకు ఇస్తున్నట్లు తేల్చారు. తనిఖీల్లో భాగంగా వెంగళ్రావు నగర్ కాలనీలోని ఏ 1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్‌లో అడుగడుగునా అపరిశుభ్రమైన వాతావరణంలో జ్యూస్‌ల తయారీ ఉన్నట్లు గుర్తించారు. తయారీ ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. రిఫ్రిజిరేటర్ తుప్పు పట్టి ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా ఇనుప కత్తులు పూర్తిగా తుప్పు పట్టినట్లు , చెత్త బుట్టల తెరిచి ఉండటంతో ఈగలధాటి ఉన్నట్లు తేల్చారు. అమీర్‌పేట ప్రధాన రహదారిలో వింటారా కాంప్లెక్స్‌లోని కోకనట్ జ్యూస్ బార్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రిఫ్రిజిరేటర్లో కుళ్లిన పండ్లు,తయారీ ప్రాంతంలో ఏ మాత్రం శుభ్రత లేదని తేల్చారు. అనంతరం అమీర్‌పేటలోని ప్రభుత్వ దవాఖానా ఎదురుగా కేజీఎన్ జ్యూస్ సెంటర్ నిర్వాహకులు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ చాలా అపరిశుభ్రమైన స్థితిలో ఉందని, జ్యూస్ తయారీ చేసే ప్రాంతంలో ఈగల మోత ఉన్నట్లు తేల్చారు.
ఫ్రిజ్‌లో పాడైన ఫ్రూట్ సలాడ్‌ను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అమీర్‌పేటలోని తిరుమల టవర్స్‌లోని నేచురల్ ఫ్లేవర్‌లో అపరిశుభ్రత వాతావరణంలో ఉన్నట్లు తేల్చారు. పైనాపిల్ క్రష్, బ్లాక్ కరెంట్ క్రష్, అరెంజ్, బ్లూ కర్రాకో, అరటిపండ్లు తదితర పండ్లు పాడైనట్లు గుర్తించారు. సోడా బాటిళ్లపై లేబుల్ సరిగా లేవని, ఫ్రిజ్‌లో బొద్దింకలు ఉన్నాయని, పనిచేసే సిబ్బంది ఎలాంటి పరిశుభ్రమైన నియమ నిబంధనలు పాటించలేదని తేల్చారు. ఆనంతరం ఆమీర్‌పేట మెట్రో పిల్లర్ నంబర్ 1443 బొంబాయి జ్యూస్ సెంటర్లో శుభ్రత లేదని తేల్చారు. కుళ్లిన పండ్లు, కూరగాయాలు ఉన్నాయని, ఫ్యాన్లు దుమ్ము పట్టి ఉన్నాయని, గుర్తించారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని, శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు స్పష్టం చేశారు.