నగరంలో వినియోగదారులను దండుకోవడమే ప్రధానంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కెఫేలు, బిర్యానీ సెంటర్లు పని చేస్తున్నాయి. ఆహార, వినియోగదారుల భద్రతను గాలికొదిలేసి, కస్టమర్లను దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని పలు కేంద్రాలు నగర వ్యాప్తంగా నడుస్తున్నాయి.
ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలను తుంగలో తొక్కి గడువు ముగిసిన పదార్థాలు, పానీయాలను వాడుతూ వినియోగదారుల జీవితాలతో సదరు పూటకూళ్ల ఇండ్లు ఆడుకుంటున్నాయి. తినడమే వృత్తిగా పెట్టుకున్న ప్రియులారా.. జర జాగ్రత్త వహించండి. ఈ నేపథ్యంలో సేఫ్టీ అధికారులు ఆయా కేంద్రాలపై దాడులు చేశారు.
Hyderabad | సిటీబ్యూరో, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ): నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. చైతన్యపురిలో బహర్ బిర్యానీ కేఫ్‌లో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించగా, వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార వస్తువులకు లేబుల్స్ లేనట్లు, పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో డంప్ చేసినట్లు తేల్చారు.
గడువు ముగిసిన పెప్పర్ సాస్, చాక్లెట్ ప్లేవర్, సిరప్ వంటివి సీజ్ చేసినట్లు చెప్పారు. శిల్పి ఎలైట్ రెస్టారెంట్ అండ్ బార్లో వంటగదిలో సీలింగ్ జిడ్డుగా ఉన్నట్లు, ఫ్రిజ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. నిల్వ చేసిన ఆహార ప్యాకెట్లకు లేబుల్ లేవని తేల్చారు. వంటగదిలో టమోటాలు, బీట్ రూట్ వంటి కుళ్లిన కూరగాయలు, పరిసరాల్లో బొద్దింకలు విపరీతంగా ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరుగా కాకుండా వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు.