ఎల్బీనగర్, జనవరి 30 : బస్తీల్లోని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడమే లక్ష్యంగా బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బస్తీనిద్రతో ప్రజల కష్టాలు తీరుస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బస్తీనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జనవరి 30వ తేదీతో 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బస్తీల్లోనే నిద్రించి బస్తీలోని సమస్యలను సమగ్రంగా తెలుసుకుని వాటిని పరిష్కారం చేయడానికే 12 ఏళ్ల క్రితం హస్తినాపురం డివిజన్లోని నందనవనంలో బస్తీనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆనాటి నుంచి ప్రజాక్షేత్రంలో నిరంతరం బస్తీల్లో నిద్ర చేసి ప్రజల సమస్యల పరిష్కరించామన్నారు. 2019లో ఫతుల్లాగూడలో బస్తీ నిద్ర చేసి ఆయా బస్తీలో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామన్నారు. బస్తీ నిద్రల్లో భాగంగా బంజారా బస్తీలో విద్యుత్ మీటర్లు, డ్రైనేజీ , మంచినీటి సదుపాయాలను కల్పించామన్నారు. మరో రెండేళ్లలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లోనూ బస్తీ నిద్ర కార్యక్రమాలను నిర్వహించి పేద ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను పూర్తిగా పరిష్కారం చేస్తామన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
ఎల్బీనగర్, జనవరి 30: నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ఆస్తిపన్నులను తగ్గించడంతో పాటు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు, చెరువుల సుందరీకరణ పనులను నెరవేర్చామన్నారు.రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ స్థలాల సమస్యలను కూడా నెరవేరుస్తున్నామని, అతి త్వరలో ఆటోనగర్ డంపింగ్ యార్డును బొటానికల్ గార్డెన్‌గా మారుస్తామన్నారు. ఇవే కాకుండా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తాలో జాతీయ రహదారిపై హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ వరకు, ఇన్నర్ రింగ్‌రోడ్డులో నాగోలు బ్రిడ్జి మొదలుకొని ఓవైసీ దవాఖాన వరకు పూర్తిస్థాయిలో పచ్చదనంతో నింపుతామన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు..
ప్రశ్నించే గొంతు అంటూ ఎన్నికల్లో గెలిచిన నాయకులు ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కడ ఉన్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నాయకులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదన్నారు.నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.
త్వరలో మూసీకి మహర్దశ ..
మూసీ నదికి త్వరలోనే మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.