ఒక మార్గంలో ట్రాఫిక్ ఉంటే మరో మార్గాన్ని ఎంచుకుంటాం. ఒక తోవలో అడ్డంకి ఉందంటే ఇంకో తోవ నుంచి బయటపడతాం. కానీ నలు దిక్కులా అదే సమస్య చుట్టుముడితే?! దానినే అష్ట దిగ్బంధనం అంటారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల దుస్థితి ఇదే. పేరుకు హైదరాబాద్ మహా నగరంలో ఉంటున్నారనేగానీ… గడప దాటి వాహనం మీద ఏవైపు వెళ్లినా రైల్వే ట్రాకులు! అదృష్టం బాగుంటే కొంత సమయంలో బయటపడతాం… లేదంటే నిమిషాలకొద్దీ పడిగాపులు..సాధారణంగా ప్రయాణికుల రైళ్లు… గూడ్స్… నిమిషాల వ్యవధిలోనే ట్రాక్ మీదుగా పోతాయి. దీంతో అవి దాటితేగానీ గేటు తెరుచుకోదు.
ఇలా ఒకట్రెండు రోజులైనా, రోజులో ఒకట్రెండు గంటలైనా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ 365 రోజుల పాటు… రోజంతా ఇదే నరకం. దశాబ్దాలుగా ఈ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న మల్కాజిగిరివాసులకు విముక్తి కలగబోతున్నది. ఈ రైల్వే దిగ్బంధనం నుంచి శాశ్వతంగా ఊరట కలుగనున్నది. మరి… ఇదేదో ఆషామాషీగా లభించిన పరిష్కారం కాదు. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వెంటపడితే ఎట్టకేలకు అయిదు రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూబీ) మంజూరయ్యాయి. ఈ మేరకు నిధులు కూడా మంజూరై… ఒక ఆర్యూబీ పనులు మొదలవ్వగా, మిగిలిన నాలుగు టెండర్ల దశలో ఉన్నాయి.
మేడ్చల్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మీదుగా ప్రతి రోజూ సుమారు 10 లక్షల మంది రైల్వే గేట్ల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రజలు ఉద్యోగాల, ఇతరాత్ర పనుల కోసం ఈ రైల్వే గేట్ల ద్వారా వెళ్తుంటారు. రైల్వే గేట్ల ద్వారా రైళ్లు, గూడ్స్ రైళ్లు అనేకం వెళ్తాయి. రైళ్లు వెళ్లే సమయంలో రైల్వే గేట్లు మూసివేయడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. రైళ్లు వెళ్లే సమయానికి 10 నిమిషాల ముందే గేట్లు వేసే క్రమంలో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ బారులు తీరుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యే సమయానికి మరో రైళ్లు వచ్చే సరిగి తిరిగి గేట్లు వేయాల్సి వస్తున్నది. దీంతో ప్రసుత్తం ఉన్న ట్రాఫిక్ క్లియర్ కాకముందే మళ్లీ ట్రాఫిక్ సమస్య వస్తున్నది. ఇలా ప్రతిరోజూ 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చి…
మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే చక్రబంధం విముక్తి కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రణాళిక ప్రకారంగా నియోజకవర్గంలో అవసరమయ్యే ఆర్యూబీ నిర్మాణాలను గుర్తించి, ఆర్యూబీ నిర్మాణాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారు. రైల్వే అధికారులతో పాటు జీహెంచ్ఎసీ అధికారులను తరచూ కలిసి ఆర్యూబీల నిర్మాణాలు చేసేలా కృషి చేశారు.
ఆర్యూబీ నిర్మాణాలకు సంబంధించి రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్యూబీ నిర్మాణాల కోసం ఎన్వోసీలు తెచ్చి ఇస్తే.. ఆర్‌యూబీలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని రైల్వే అధికారులు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 ఆర్యూబీల నిర్మాణానికి ఎన్వోసీలు తీసుకుని రైల్వే అధికారులకు సమర్పించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఐదు ఆర్‌యూబీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆర్యూబీలకు రూ. 148 కోట్ల నిధులు మంజూరు
రైల్వే చక్రబంధం నుంచి త్వరలోనే విముక్తి లభించనున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఐదు ఆర్‌యూబీలు మంజూరయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సఫిలీకృతులైన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి,ఐదు ఆర్యూబీలకు రూ. 148 కోట్ల నిధులను రాబట్టారు. ఐదు ఆర్యూబీలకు సంబంధించి తుర్కపల్లి ఆర్యూబీ పనులు ప్రారంభమవ్వగా, మరో 4 ఆర్‌యూబీలు టెండర్ల ప్రాసెస్‌లో ఉన్నాయి.
రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో 11 ఆర్‌యూబీలు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం ఐదు ఆర్‌యూబీలు మంజూరు కాగా, మరో 6 ఆర్యూబీలకు త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. కాగా, నియోజకవర్గంలోని మచ్చబోల్లారం డివిజన్లోని తుర్కపల్లి ఆర్‌యూబీకి రూ..8 కోట్లు, బీహెచ్ఈఎల్ అల్వాల్ ఆర్‌యూబీకి రూ. 28 కోట్లు, జనప్రియ మచ్చబోల్లారం ఆర్‌యూబీకి 6.6 కోట్లు, నేరెడ్‌మెట్‌లోని వాజ్‌పేయినగర్‌లో ఆర్‌యూబీకి రూ. 74 కోట్లు, వినాయక్నగర్లోకి కాకతీయనగర్‌లో ఆర్‌యూబీకి రూ. 32 కోట్లు మంజూరయ్యాయి. తుర్కపల్లి ఆర్యూబీ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మిగతా నాలుగు ఆర్యూబీల పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఊరట పొందే ప్రాంతాలివే…
తూర్పు దిక్కున సఫిల్‌గూడ, గౌతంనగర్, ఉత్తరం వైపున ఉప్పర్‌గూడ, మౌలాలి, పడమర వైపున వాజ్పేయినగర్, అమ్ముగూడ దక్షణం వైపున బీహెచ్ఈఎల్, జనప్రియ, మచ్చబోల్లారం, తుర్కపల్లి రైల్వే గేట్లు దాటాల్సిన పరిస్థితి. మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్కాజిగిరి సర్కిల్లో మల్కాజిగిరి, వినాయక్‌నగర్, మౌలాలి, గౌతంనగర్, ఈస్ట్ఆనంద్బాగ్, నేరెడ్మేట్ డివిజన్లు ఉండగా అల్వాల్ సర్కిల్లో అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్లు ఉన్నాయి.
తూర్పు దిక్కున ఉన్న సఫీల్‌గూడ, గౌతంనగర్ పరిధిలో 30 కాలనీలు ఉండగా, వినాయక్‌నగర్ పడమర వైపు ఉన్న వాజ్‌పేయినగర్‌లో రైల్వే గేటు ఉన్న ప్రాంతంలో సుమారు 150 కాలనీలు ఉన్నాయి. ఉత్తరం వైపున ఉన్న ఉప్పర్‌గూడ మౌలాలి రైల్వే గేటు ప్రాంతంలో 25 కాలనీలు దక్షణం వైపున తుర్కపల్లి, జనప్రియ, బీహెచ్ఈఎల్ రైల్వే ట్రాక్‌ల సమీపంలో వందలాది సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. వివిధ పనుల కోసం మల్కాజిగిరి నియోజకవర్గం దాటాలంటే రైల్వే చక్రబంధాన్ని చిల్చుకుంటూ వెళ్లాల్సిందే. నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 362 కాలనీవాసులు ప్రతి రోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీల పూర్తితో వీరందరికీ శాశ్వత పరిష్కారం లభించనున్నది.
ఇచ్చిన హామీలు నెరవేర్చేలా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆర్యూబీ నిర్మాణాలకు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాను. నియోజకవర్గంలో 11 ఆర్యూబీల నిర్మాణాలను చేయిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైల్వే, జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి నిధులు మంజూరు చేయించాను. మొదట ఐదు ఆర్యూబీల నిర్మాణాలకు రూ. 148 కోట్లు మంజూరయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్యూబీలకు సంబంధించి ఎన్వోసీలు తీసుకొచ్చి రైల్వే అధికారులకు సమర్పించా. త్వరలోనే 6 ఆర్యూబీలకు నిధులు మంజూరు కానున్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గాన్ని రైల్వే చక్ర బంధం నుంచి విముక్తి కోసం కృషి చేస్తున్నా. మల్కాజిగిరి నియోజకవర్గాల ప్రజలకే కాకుండా ఇతర ప్రాంత ప్రజలకు సౌకర్యంగా మారనున్నది. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి