మాటలకందని విషాదమిది.. శోభాయాత్ర కన్నీటి వ్యధను మిగిల్చింది. విద్యుత్ తీగలు మృత్యుపాశమైంది.. ఏం జరిగిందో తెలుసుకునేలోపే.. నిండు ప్రాణాలు బలైపోయాయి.. రామంతాపూర్లోని గోఖలేనగర్లో ఆదివారం అర్ధరాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో ఈ దుర్ఘటన జరిగింది. రథం లాగుతున్న క్రమంలో అది కరెంటు వైర్లకు తాకడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రజాప్రతినిధులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఘటనకు బాధ్యులెవరైనా..ఎవరి నిర్లక్ష్యమైనా.. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్న తమ వారు ఇక లేరనే విషయాన్ని బాధిత కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గుండెలవిసేలా రోదిస్తున్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): శ్రీకృష్ణా జన్మదిన వేడుకల్లో భాగంగా రామంతాపూర్లోని గోఖలేనగర్లో వైభవంగా శ్రీకృష్ణుడి రథయాత్రను నిర్వహించారు. శనివారం రాత్రే కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథయాత్ర కూడా ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదివారం ఉదయం అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు ఉండడంతో శనివారం రాత్రి జరగాల్సిన రథయాత్రను ఆదివారం రాత్రికి నిర్వాహకులు మార్చుకున్నారు. ఈ ఊరేగింపునకు స్థానిక ప్రజలు వారి బంధువులు, స్నేహితులను పిలిపించుకున్నారు.
కాలనీలు, వీధుల్లో రథయాత్ర నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా అధ్యాత్మిక శోభ నెలకొంది. రథాన్ని లాగే జీపులో డీజిల్ అయిపోవడంతో రథాన్ని నిలిపే స్థలానికి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. అంతా అయిపోయింది కదా.. అనే భావనతో అక్కడ ఉన్న యువకులు, రథయాత్రను చూసేందుకు వచ్చిన వాళ్లంతా రథాన్ని చేతులతో తోస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వర్షంలోనే యాత్రను పూర్తి చేశారు. అందరూ ఎవరి ఇండ్లలోకి వాళ్లు వెళ్లిపోతున్నారు. ఇంతలో రథాన్ని తోస్తున్న వారికి విద్యుత్ షాక్ తగిలి రథానికి ఉన్న ఇనుమును పట్టుకోవడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు.
రథానికిపై ఉన్న కేబుల్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రథంలో కార్పెట్ ఉండడంతో పైన ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. రథాన్ని బయట నుంచి తోస్తున్న వారు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విద్యుత్ లైన్లపై నుంచి కేబుల్ వైర్లు వెళ్లడంతో, ఆ కేబుల్ వైర్ల కాపర్ తేలింది, దాని ద్వారా విద్యుత్ సరఫరా అయి రథానికి విద్యుత్ సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఓల్డ్ రామంతాపూర్కు చెందిన కృష్టా అలియాస్ డైమాండ్ యాదవ్(21), సురేశ్యాదవ్(34), హబ్సిగూడకు చెందిన రుద్రవికాస్(39), రామంతాపూర్ శారదనగర్కు చెందిన శ్రీకాంత్ రెడ్డి (35), హబ్సిగూడ రవీంద్రనాథ్ కాలనీకి చెందిన రాజేంద్రరెడ్డి(48) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గాయపడిన వారిలో గోల్నాకకు చెందిన గణేశ్(21) ఉస్మానియా, ఓల్డ్రామంతాపూర్కు చెందిన రవీంద్రయాదవ్ అపోలో, ఎల్బీనగర్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాగోల్లోని సుప్రజ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఓల్డ్రామంతాపూర్కు చెందిన మహేశ్(27)కు ప్రాధమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. గాయాలపాలైన శ్రీనివాస్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.