సైదాబాద్, జూలై 24: వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మైనర్లు సైదాబాద్‌లోని జువైనల్ హోం నుంచి తప్పించుకున్నారు. పక్కా పథకం ప్రకారం సిబ్బంది కండ్లు గప్పి.. మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి పరారయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనాలు చేయడానికి చిన్నారులంతా జువైనల్ హోం మొదటి అంతస్తు నుంచి డైనింగ్ హాల్ వచ్చారు.
అనంతరం చిన్నారులంతా సిబ్బందితో మాట్లాడుతున్నట్లు నటించి వారి దృష్టి మళ్లించగా అందులో ఐదుగురు మైనర్లు భవనం పైకి ఎక్కి అక్కడి నుంచి ప్రధాన గేట్ వద్దకు చేరుకొని దాని తాళం పగలగొట్టి పరారయ్యారు. ఐదుగురిలో ఏపీకి చెందిన ఇద్దరు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు.. హైదరాబాద్‌కు చెందిన మరొకరిపై కేసులు నమోదు కాగా వారిని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించిన విషయం విదితమే.
చిన్నారులు తప్పించుకున్న సమాచారం అందుకున్న హోం సూపరింటెండెంట్ ఉమర్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి జువైనల్ హోం ఉన్నతాధికారులకు సమాచారం అందించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలురుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు జువైనల్ హోం నుంచి చిన్నారులు తప్పించుకున్న సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేసిన సిబ్బంది వారి ఇంటికి వస్తే వెంటనే తెలియజేయాలని కోరారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు..
బాలులు తప్పించుకున్న సమాచారం అందుకున్న బాలల సంక్షేమం, సంస్కరణల, వీధి బాలల సంక్షేమ శాఖ (జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్) డిప్యూటీ డైరెక్టర్ ఎస్. చార్వక జువైనల్ హోంను పరిశీలించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఆర్ఏపీ అధికారి రవికుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.