Chepa Prasadam | అబిడ్స్, జూన్ 9: మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా బత్తిని కుటుంబం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. మొత్తం 70 వేల మందికిపైగా చేప ప్రసాదాన్ని స్వీకరించినట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా, మత్స్య శాఖ అధికారులు 55 వేల 440 వరకు కొర్రమీన్ల విక్రయాలు చేపట్టారు. శాకాహారులు మాత్రం వేరుగా ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే, చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.
చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఫలహారాలు అందించి.. పలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వాన్ని చాటుకున్నాయి. జలమండలి లక్షల మంచినీటి ప్యాకెట్లతో పాటు నలభై వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్ స్వీయ పర్యవేక్షణలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు తాత్కాలికంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు.
-మెట్టు సాయికుమార్, తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్