మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పొందే రైతులు సుమారు 20 వేలకు పైగా ఉన్నారు. అయితే మొదటి విడతలో 2,667 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. లక్ష 50 వేలు రుణమాఫీ పొందే రైతుల్లో ఆందోళన నెలకొన్నది. జిల్లాలో 9 సహకార సంఘాలు ఉన్నాయి. మొదటి విడతలో పూడూర్, ఘట్కేసర్, అల్వాల్ సహకార సంఘాల్లో ఆడిట్ పేరుతో ఒక్క రైతుకు కూడా మొదటి విడతలో రుణమాఫీ చేయలేదు.
అంతేకాకుండా బౌరంపేట సహకార సంఘంలో 632 మంది రైతులు ఉండగా, 11 మందికి మాత్రమే రుణమాఫీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి ఫిర్యాదు చేసినా.. ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని అన్నదాతలు వాపోతున్నారు. కాగా, నేడు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రెండో విడతలో రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయనున్నారు. అయితే ఎంత మందికి రుణ మాఫీ చేస్తారన్నది ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని రైతులు పేర్కొంటున్నారు.