సిటీబ్యూరో, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): గగన తలంలో వైమానిక దళం చేసిన విన్యాసాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ వైమానిక బృందం ఆధ్వర్యంలో ఫైటర్ జెట్లతో హుస్సేన్ సాగర్ ఉపరితలంలో చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలను చూసి సందర్శకులు నివ్వెరపోయారు. హెచ్ఎండీఏతో పాటు పలు విభాగాల సమన్వయంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలకు చూసేందుకు జనాలు ఆదివారం భారీగా చేరుసుకున్నారు.
యుద్ధ విమానాలతో ఎయిర్‌ఫోర్స్ బృందం చేసిన ఎయిరో బాటిక్ షో అద్భుతంగా నిలిచాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, నగరవాసులు తిలకించారు. తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వ్యూ డెక్ నుంచి వీక్షించారు.
ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ జనాలతో నిండిపోయాయి. తొమ్మిది ఫైటర్ జెట్ విమానాలతో ఆకాశంలో చేసిన విన్యాసాలను చూసేందుకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌తో పాటు, ట్యాంక్ పరిసరాల్లో ఉండే అబిడ్స్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్, గాంధీనగర్, వరకు బిల్డింగులపై నుంచి ఎయిర్ షోను తిలకించారు. ఇక ట్యాంక్ బండ్‌పై ఇప్పటికే లైటింగ్, లేజర్ షోతో పాటు, ప్రత్యేకమైన క్రాకర్ షోను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది.