సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు జీవ వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న క్లినిక్లు, ఫస్ట్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. రోగుల తాకిడి పెరగడంతో బయో వ్యర్థాలు పెద్దమొత్తంలో ఏర్పడుతున్నాయి.
అక్కడ వాడిన సిరింజీలు, స్లైన్ బాటిళ్లు, సూదులు, గాయాలకు డ్రెస్సింగ్ చేసిన దూది, మూత్రపు పైపులు, మాస్కులు, చేతి గ్లౌలు తదితర వ్యర్థాలను పెద్ద మొత్తంలో బహిరంగ ప్రదేశాలు, చెత్త కుప్పలు, డంపింగ్ యార్డుల్లో పడేస్తున్నారు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్ చెత్త కుప్పలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి వెళ్తున్నారు. ఆ మూటల్లో ఏముందు తెలియకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది కూడా వాటిని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, గల్లీల్లోని ఫస్ట్ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. పురపాలక చెత్త వ్యాన్లలోనూ పడేస్తున్నారు. ఇంట్లోనే క్లినిక్లను నిర్వహిస్తుండటంతో బయో వ్యర్థాలను కూడా గృహ వ్యర్థాలతో కలిపి బయటకు కనిపించకుండా డస్ట్ బిన్ కవర్ల ద్వారా చెత్త బండ్లలో వేస్తున్నారు. దీంతో చెత్తను తొలగించేవారు, సేకరించేవారు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలకు తూట్లు..
క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నుంచి మల్టీ స్పెషాలిటీ దవాఖానల దాకా చికిత్స ద్వారా ఏర్పడిన బయో మెడికల్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలి. నిబంధనలు పాటించని సెంటర్లపై మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016 ప్రకారం సురక్షితంగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నాయి.
గృహ వ్యర్థాలతో పాటు పారబోయడం వల్ల బయో మెడికల్ వ్యర్థాల్లో ఉండిపోయిన కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ వల్ల చెత్తను తొలగించే సిబ్బంది వ్యాధుల బారిన పడుతున్నారు. అదేవిధంగా అవి గాలి, నీటిలో కలిసిపోవడం వల్ల కాలుష్యం ఏర్పడి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వీటిని తొలగించే క్రమంలో సూదులు, ఫోర్స్లిప్లు గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వాటిని తొలగించే క్రమంలో సిబ్బందికి హెపటైటిస్, హెచ్ఐవీ, టీబీ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదాలున్నాయి.
కాలుష్య నియంత్రణ మండలి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాలుష్య నియంత్రణ మండలి సుప్తావస్థలోకి వెళ్లిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో రెండేండ్లుగా కనీస తనిఖీలు, బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే కాలనీలు, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
దవాఖానలు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, గృహ వ్యర్థాల డంపింగ్ యార్డుల్లో ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడా తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు జీవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి జీవ వ్యర్థాలను సేకరించే వాహనాలకు లైసెన్స్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నది. వాటిని అన్ని రకాల దవాఖానలు వినియోగించుకుంటున్నాయా? లేదా? అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు చెత్తను ఎక్కడపడితే అక్కడే విచ్చలవిడిగా పడేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం వల్ల పర్యావరణం, ప్రజల జీవనం ప్రమాదంలో పడుతున్నది. ఇప్పటికైనా పీసీబీ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టి అత్యంత ప్రమాదకరమైన కాలుష్య, వ్యాధికారకాలను కట్టడి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు.