సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): బహుళ అంతస్తుల్లో నివాసముంటున్న వారు, విధులు నిర్వహించే వారు.. ఆ భవనంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం, అగ్నిమాపక భద్రతా పరికరాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (డీజీ) సీవీ ఆనంద్ సూచించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో అగ్నిమాపక శాఖతో పాటు ఆరోగ్య శాఖ, మున్సిపల్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఆర్అండ్బీ, విద్యుత్, 108 అంబులెన్స్, వాటర్ వర్క్స్, నగర పోలీస్ విభాగంలోని ట్రాఫిక్, లా అండ్ అర్డర్ విభాగాలు పాల్గొన్నాయి.
అప్రమత్తత అవసరం..
టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వంటి అత్యవసర పరిస్తితులలో భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎలా సురక్షితంగా కాపాడాలి, స్వచ్ఛందంగా తమను తాముగా ఎలా కాపాడుకోవాలనే విషయాలపై డ్రిల్ నిర్వహించారు. 83.26 మీటర్ల ఎత్తున్న టీజీ ఐసీసీసీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిననప్పుడు ముందుగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని, అలాగే అందులో ఉన్న సిబ్బంది అగ్నిమాపక భద్రతా సౌకర్యాలకు సంబంధించిన పరికాలు ఎక్కడున్నాయో, ఎలా ఉపయోగించాలనే విషయంలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి ఫ్లోర్లో ఒక ఫైర్ మార్షల్ అతనికి అసెస్టింట్ నియమిస్తామని అత్యవసర పరిస్తితులలో ఎలా వ్యవహారించాలనే విషయంపై వాళ్లు ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారని వివరించారు. ఇలాంటి మాక్ డ్రిల్స్‌ను ప్రతీనెల మొదటి శనివారం నిర్వహిస్తామని కమలాసన్‌రెడ్డి తెలిపారు.
అత్యుత్తమ ప్రమాణాలతో ..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. బహుళ అంతస్తుల భవనాలలో ఫైర్ మాక్ డ్రిల్ చాలా ముఖ్యమైందన్నారు. టీజీ ఐసీసీసీ భవనం పూర్తిస్థాయిలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నిర్మించబడిందని, ప్రస్తుతం 7.5 ఎకరాల స్థలంలో మధ్యలో ఈ భవనం నిర్మించడం వల్ల అత్యవసర పరిస్తితులలో ఫైర్ ఇంజన్లు, 108 వాహనాలు సులభంగా చేరుకుంటాయన్నారు. ఈ భవనానికి ప్రతి టవర్‌కు రెండు ప్రదేశాలలో మెట్లు ఉన్నాయని అన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 2వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యవసర సమయంలో లిఫ్ట్‌లు కూడా వాడకుండా మెట్లదారులను ఎంచుకోవాలని సీవీ ఆనంద్ సూచించారు. అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీలు అపూర్వరావు, పుష్ప, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.