నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన మెట్రో ప్రయాణం దొరకడమే గగనంగా మారుతున్నది. ముఖ్యంగా మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడనున్నది. దీంతో వేల కోట్ల కొత్త బోగీల ప్రతిపాదనలను పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇన్నాళ్లు ఎల్ అండ్ టీ నిర్వహణ భారం, సిబ్బంది జీతభత్యాలను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ భరించనున్నది. ఈ నేపథ్యంలో పెరగనున్న ఆర్థిక భారం ప్రయాణికులకు సౌకర్యాలు లేకుండా చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : పీపీపీ విధానంలో ఎల్అండ్టీ ఈ ప్రాజెక్టును చేపట్టి, విజయవంతంగా నిర్వహించింది. ఆదాయ వనరులు, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం ఈ సంస్థపై అప్పుల భారం పడింది. కానీ నిర్ణీత గడువు వరకు ఈ అప్పులను మోయాల్సిందేనని నిశ్చయించుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో విస్తరణ పేరిట, స్వాధీన ప్రతిపాదనతో భారీ అర్థిక భారాన్ని రాష్ట్ర ఖజానాపై మోపింది. ఈ స్వాధీన ప్రక్రియ వల్ల హెచ్ఎంఆర్ఎల్పై వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడనున్నది.
పెరుగుతున్న రద్దీ
మెట్రో రైళ్లలో విపరీతంగా పెరుగుతున్న రద్దీకి పరిష్కారం కొత్త బోగీలను చేర్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఏడాదిన్నర కిందటే ప్రతిపాదించిన హెచ్ఎంఆర్ఎల్ వాటిని ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో పక్కనపెట్టే యోచనలో ఉంది. రెండేళ్ల వరకు కొత్త బోగీలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవడం అనేది సిద్ధాంతపరంగా ఆమోదంగా ఉన్నా.. ఆర్థికంగా ఎంతవరకు సాధ్యం అవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రెండో దశ మెట్రో విస్తరణ, నిధుల సర్దుబాటు, కొత్త బోగీల కొనుగోలు ఇవన్నీ కూడా ప్రయాణికుల మౌలిక వసతులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలంటే పటిష్టమైన రవాణా వ్యవస్థ అవసరం. కానీ మెట్రో స్వాధీన ప్రక్రియ పేరిట ఆర్థిక భారాన్ని మోపి, ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ఉందనీ అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.