బంజారాహిల్స్,అక్టోబర్ 4: ఆస్ట్రేలియా వెళ్తున్నాను.. నా కోసం వెతకవద్దు.. అంటూ వాట్సాప్‌లో కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్‌పేట సమీపంలోని సబ్జా కాలనీలో నివాసముంటున్న మాహియా తరన్నుమ్(24) డీ- ఫార్మసీ పూర్తిచేసి, సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో గత పది రోజులుగా శిక్షణకు వెళ్తోంది. మంగళవారం ఉదయం ఇంట్లోంచి ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఫోన్ నుంచి మధ్యాహ్నం 3గంటల సమయంలో తండ్రి గఫార్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ‘నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను.. నా కోసం వెతకవద్దు..’ అంటూ వాట్సాప్ మెసేజ్‌లో ఉంది. దీంతో ఆందోళనకు గురైన తండ్రి గఫార్ ఆమెకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. పలు ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత 8 నెలలుగా తన సహచరుడైన ఓ డాక్టర్‌తో తన కుమార్తె ప్రేమలో ఉన్నదని, బీహార్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి చేయడం ఇష్టం లేకపోవడంతో తాము పెళ్లికి అంగీకరించలేదంటూ తండ్రి గఫార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.