పచ్చని చెట్లు.. పంట పొలాలు..ఫాంహౌస్‌లు.. ఇలా ఎంతో సహజ సిద్ధమైన వాతావరణం కలిగిన జంట జలాశయాల పరిసర ప్రాంతాలు షూటింగ్‌లకు స్పాట్లుగా మారుతున్నాయి. అందమైన లొకేషన్లకు పెట్టింది పేరైన ఔటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సీరియళ్లు, వెబ్ సిరీస్‌లనూ చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, సైరా సినిమాలు అక్కడే చిత్రీకరణ పూర్తి చేసుకోగా అవి బ్లాక్ బ్లస్టర్గా నిలిచాయి. దీంతో ప్రతిఒక్క నిర్మాత ఈ ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి సిద్ధమైన లొకేషన్ల కోసం ఎక్కడికో పరిగెత్తకుండా నార్సింగి, కోకాపేట, గండిపేట, మొయినాబాద్, చిలుకూరు, హిమాయత్‌నగర్ లాంటి ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. అంతేకాక నిర్మాతలు, సినీ పెద్దలు, టెక్నీషన్లు ఎక్కువగా ఉంటే జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లకు జంటజలాశయాలు అతి దగ్గరలో ఉండటంతో తక్కువ సమయంలో షూటింగ్‌లను సైతం పూర్తి చేస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): నగర శివారులోని జంటజలాశయాలైన గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్‌లు షూటింగ్‌లకు ఎంతో అనుకూలంగా మారుతున్నాయి. జలాశయాల పరిరక్షణ కోసం త్రిబుల్ వన్ జీవో అమలు చేస్తుండటంతో ఇక్కడ నివాస ప్రాంతాలు తక్కువగా.. ఫాంహౌస్, పంటపొలాలు, పచ్చని చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ రియల్ బూమ్ ఉండటంతో ఎటు చూసినా లేఅవుట్లే దర్శమిస్తాయి. అయితే ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న జంటజలాశయాల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా బహుళ అంతస్తుల భవనాలు కనిపించవు. ఓ వేళ ఉన్నా అవి ఫాంల్యాండ్స్ 1000 గజాల నుంచి ఎకరం మించి ఉన్నాయి. ఇలాంటి చోట్ల పచ్చని వాతావరణాన్ని పెంచి షూటింగ్‌లకు స్పాట్లుగా మార్చుతున్నారు.
ఒకప్పుడు షూటింగ్‌లు ఎక్కువగా జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట ప్రాంతాల్లోని స్టూడియోలు, రోడ్లమీదే జరిగేవి. కానీ ప్రస్తుతం విపరీతంగా రద్దీ పెరగడంతో స్టూడియోల్లో తప్పా రోడ్లపై చేసుకునే పరిస్థితి లేదు. అయితే జనాల రద్దీ పెద్దగా లేని, అందమైన లొకేషన్లు ఉన్న గండిపేట, హిమాయత్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు అత్యంత అనుకూలంగా మారాయని నిర్మాతలు వివరిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వారంతా ఉండేది జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మణికొండ, చిత్రపురి కాలనీ లాంటి ప్రాంతాల్లోనే. వారంతా జంటజలాశయాల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అంటేనే ఆసక్తి చూపుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని సంపన్నులు, వ్యాపారవేత్తలు, రియల్ వ్యాపారులకు చెందిన ఫాంహౌస్లన్నీ జంట జలాశయాల చుట్టుపక్కలే ఉన్నాయి. వీకెండ్ లేదంటే నెలకోసారి కుటుంబంతో కలిసి ఉండేందుకు వాటిని వినియోగిస్తున్న వ్యాపారులు.. మిగిలిన రోజుల్లో షూటింగ్‌లు చేసుకునేందుకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో యజమానులకు లక్షల్లో ఆదాయం సమకూరుతున్నది. ముఖ్యంగా చిలుకూరు, వట్టినాగులపల్లి, మొయినాబాద్, ఆజీజ్‌నగర్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ఎకరం మొదలుకొని 10 ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి.
గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఔటర్ రింగురోడ్డుకు ఒకవైపు గండిపేట, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలే కనిపిస్తాయి. దీంతో ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న సర్వీసు రోడ్లు షూటింగ్‌లకు అందమైన లొకేషన్లుగా మారాయి. ఓ తెలుగు టీవీ చానల్లో ప్రసారమయ్యే రెండు, మూడు సీరియళ్ల షూటింగ్‌లన్నీ గండిపేట, మంచిరేవుల చుట్టే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అప్పా నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఉన్న సర్వీసు రోడ్డును ప్రయాణం సీన్ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడి సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండడం నిర్మాతలకు ఎంతగానో కలిసి వస్తోంది.
సినీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మణికొండలోని చిత్రపురి కాలనీలకు త్రిబుల్ వన్ జీవో పరిధిలోని ప్రాంతాలు అత్యంత సమీపంలోనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ నుంచి అరగంటలోనే షూటింగ్ జరిగే లొకేషన్‌కు చేరుకోవచ్చు. గతంలో కోకాపేట, చిలుకూరు, అజీజ్‌నగర్, మొయినాబాద్, శంకర్పల్లి ప్రాంతాలకు మెహిదీపట్నం, నార్సింగి, అప్పా జంక్షన్ మీదుగానే వెళ్లే అవకాశం మాత్రమే ఉండేది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల నుంచి నేరుగా రాయదుర్గం, మణికొండ, నానక్‌రాంగూడ మీదుగా అరగంట వ్యవధిలోనే షూటింగ్ లొకేషన్‌కు ఆర్టిస్టులు, 24 క్రాప్ట్స్కు చెందిన నిపుణులు చేరుకుంటున్నారు. దీంతో షూటింగ్‌లు నిర్ణీత సమయానికే ప్రారంభించి ముగిస్తున్నారు. నగర శివారు ప్రాంతం కావడంతో జన సాంద్రత తక్కువగా ఉండడంతో షూటింగ్‌లు సాఫీగా చేసుకునేందుకు అవకాశం ఉంటోంది.