Kubera | ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 : త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా నిర్మితమవుతున్న కుబేర సినిమా టైటిల్ హక్కులు తనవేనని నిర్మాత కె. నరేంద్ర తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహ నిర్మాతలు రవికాంత్, మల్లేశ్‌తో కలిసి మాట్లాడుతూ తమ నిర్మాణ సంస్థ ద్వారా కుబేరా టైటిల్‌ను ఖరారు చేస్తూ 2023 నవంబర్ 28న రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు.
దానికి సంబంధించిన షూటింగ్ సైతం ప్రారంభించామని, ప్రస్తుతం 85 శాతం వరకు జరిగిందన్నారు. అదే టైటిల్‌తో ప్రముఖ దర్శకుడు తన పేరును ట్యాగ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారన్నారు. దీనిపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఆ టైటిల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తనకే హక్కులు ఉంటాయని, వెంటనే ఆ టైటిల్‌ను తొలగించాలని, ఒక వేళ వారు అదే టైటిల్‌ను వాడుకోవాలనుకుంటే తనకు నష్టపరిహారం కానీ, సినిమాలో వాటాలు కానీ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరంగా పోరాడుతానని నిర్మాత నరేందర్ స్పష్టం చేశారు.