Digital Media | బంజారాహిల్స్, మార్చి 28: డిజిటల్ మీడియా నుంచి నాణ్యమైన వార్తలతో పాటు స్ఫూర్తినిచ్చే కథనాలు రావాలని ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ అన్నారు. ఫిలిం ఛాంబర్లోని రామానాయుడు కళామండపంలో జరిగిన వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం అండ్ టీవీ డైరెక్టరీ ఆవిష్కరణ, డిజిటల్ మీడియా జర్నలిస్టుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబికా కృష్ణ మాట్లాడుతూ.. నేటి యుగంలో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత పెరిగిందని, టాలెంట్, వార్తలపై అవగాహన ఉన్నవారంతా జర్నలిస్టులుగా మారుతూ వార్తలు అందిస్తున్నారని అన్నారు. మెయిన్ స్ట్రీమ్ సంస్థలు కూడా ఇప్పుడు డిజిటల్ జర్నలిజంపై దృష్టి పెట్టి దూసుకెళ్తున్నాయని అన్నారు.
వీబీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ‘మా’ అసోసియేషన్ ఈసీ మెంబర్ విష్ణు బొప్పన మాట్లాడుతూ.. ప్రతియేటా వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో టీవీ ఆర్టిస్టులతో పాటు డిజిటల్ రంగంలో పని చేస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం కోసం అవార్డులు అందజేస్తున్నమనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మా ఈసీ మెంబెర్ విష్ణు బొప్పన, సినీ నిర్మాత కే.ఎస్.రామారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.