సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు ఈ విలీనం జాబితాలో ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలోని 13 మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు.
కాగా విలీనం చేసిన ఆ గ్రామాలు, ప్రాంతాలు పట్టణీకరణ చెందుతుండటంతో విలీనం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ఇతర గ్రామాల ప్రజలు సైతం డిమాండ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. అలాంటి డిమాండ్ వస్తే ఔటర్ బయట ఉన్న వాటిని మళ్లీ నగర పంచాయతీలుగా పరిగణించాలని భావిస్తున్నారు. కాగా ఇదంతా జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను కలిపేందుకే గ్రామాలను ముందుగా సమీప మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి. కొత్తగా విలీనం చేసిన గ్రామాలన్నీ 13 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి.
మేడ్చల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో విలీనంపై 28 గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. మంగళవారం ప్రభుత్వం జిల్లాలోని 28 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు 61 గ్రామపంచాయతీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాగా ఏర్పడింది.అయితే 61 గ్రామాలకు గాను 28 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్న నేపథ్యంలో మిగతా 33 గ్రామాల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది.