సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో, 180 ఏండ్ల చరిత్ర కలిగిన పబ్లిక్ గార్డెన్‌కు ముప్పు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వరకు అనుసంధానం చేసేలా నాంపల్లి రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా, అసెంబ్లీ వెనుక భాగం, పబ్లిక్ గార్డెన్ మీదుగా ైఫ్లైఓవర్ నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. ఈ వంతెన పబ్లిక్ గార్డెన్స్ మీదుగా వెళ్లేలా అధికారులు డిజైన్లు రూపొందించారని, ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును గట్టేక్కించేందుకు నగరం నడిబొడ్డున విస్తరించి ఉన్న పబ్లిక్ గార్డెన్‌ను లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నది.
సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ) : నగరంలో రోజురోజుకు సిమెంట్, కాంక్రీట్ కట్టడాలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయి, పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ మరిచిన ప్రభుత్వం.. నగరానికి ప్రాణ వాయువును అందించే ఉద్యానవనాలను చెరబడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ప్రాజెక్టుల పేరిట, అభివృద్ధి పనుల కోసం విస్తరించిన గ్రీన్ బెల్ట్‌ను నిర్వీర్యం చేస్తోంది. విస్తరించిన మహా వృక్షాలను విడవకుండా సర్వనాశనం చేస్తోంది.
నిజాంల కాలం నాటి చారిత్రక బాగ్ ఏ ఆమ్గా పిలిచే పబ్లిక్ గార్డెన్‌కు ముప్పు తెచ్చేలా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజావసరాల పేరిట ప్రకృతిపై విధ్వంసపు దాడులకు తెగబడుతోంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో, 180 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పబ్లిక్ గార్డెన్ సామాన్యుడికి, పేదవాడికి ఒక విలాసవంతమైన ప్రాంతం. ఈ ఉద్యానవనాన్ని చెరబట్టేందుకు కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వరకు అనుసంధానం చేసేలా నాంపల్లి రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా, అసెంబ్లీ వెనుక భాగం, పబ్లిక్ గార్డెన్ మీదుగా ఈ ఫ్లైఓవర్ సాగనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసమే పబ్లిక్ గార్డెన్స్ మీదుగా వెళ్లేలా అధికారులు డిజైన్లు రూపొందించారని, దానికి ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును గట్టేక్కించేందుకు నగరం నడిబొడ్డున ఉన్న విస్తరించి ఉన్న అర్బన్ ఫారెస్ట్రీ లేకుండా చేస్తోంది.
అభివృద్ధి పేరిట దాడులు..
ప్రకృతిని ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. రెండున్నరేళ్లలో ఐదారు వందల ఎకరాల్లో ఉన్న గ్రీన్ బెల్ట్‌ను తొలగిస్తోంది. గతంలో జరిగిన కొన్ని కీలక పర్యావరణ ఉల్లంఘనలు నిర్జీవ సాక్షులుగా నేలకూలిన వృక్షాలే నిలుస్తున్నాయి. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు నగరంలో హరితహననం చేసింది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వరకు చేరింది. దీనిపై సర్కారుకు ముకుతాడు వేసిన ఫలితం లేకుండా పోయింది.
ఆ తర్వాత నగరానికి ప్రాణవాయువును అందించే కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల కోసం వందలాది చెట్లను నరికేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణవేత్తల పోరాటంతో మరోసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ పనులను చెట్ల నరికివేతను నిలిపివేసింది. కానీ అప్పటికే 90 శాతానికి పైగా వృక్షాలపై గొడ్డలి వేటు వేసింది. పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వందలాది చెట్లను నేలమట్టం చేసింది. తాజాగా 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న పబ్లిక్ గార్డెన్‌పై భస్మాసుర హస్తాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది.
శరవేగంగా తరిగిపోతున్న వృక్ష సంపదతో నగరం ఒక అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారే ప్రమాదం ఉందని ఓవైపు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్కారు మాత్రం కేవలం ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపెట్టి, పచ్చదనాన్ని చెరబట్టేందుకు సిద్ధమైంది. చారిత్రక కట్టడాలు, పచ్చదనం ఉన్న ప్రాంతాలనే టార్గెట్ చేయడం ఎందుకని, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా తీరు మారని సర్కారు… కోర్ సిటీలో విస్తరించి ఉన్న అతి స్వల్ప బయో డైవర్సిఫైడ్, హిస్టారికల్ పార్క్‌ను కనుమరుగు చేసేలా ప్రణాళికలతో ముందుకు వస్తోంది.