సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ): తగ్గుముఖం పడుతున్నాయనుకుంటే.. కొద్ది విరామం ఇచ్చి తిరిగి డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఉన్నత పోస్టుల్లో ఉన్న వారిని, రిటైర్డు ఉద్యోగులను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌ను నెలకుపైగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్‌తో బెదిరిస్తూ రూ. 67 లక్షలు సైబర్ లూటీ చేశారు. డిజిటల్ అటెండన్స్ తీసుకుంటూ నకిలీ పోలీసులు రోజుల తరబడి వేధిస్తూ డబ్బులు వసూ లు చేశారు.
రాచకొండలో నమోదైన ఈ డిజిటల్ అరెస్ట్ కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
మేడిపల్లిలో నివాసం ఉంటున్న బాధితురాలు ఓయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 7న టెలికమ్యూనికేషన్ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. మీపై మహారాష్ట్ర హైకోర్టులో కేసు నమోదైందని, అక్రమ కార్యకలాపాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఫలానా మొబైల్ నంబర్ నుంచి పంపించారని, ఆ మొబైల్ నంబర్ ముంబయి అందేరీలో షాప్ నంబర్ 5లో మీ ఆధార్ వివరాలతో ఢిల్లీకి చెందిన మనీషా అనే పేరుతో తీసుకున్నారని వివరించారు.
మీరు ముంబయి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితురాలు చెప్పినా మీ ఆదార్ పంపించండి మీరు ఒంటరిగా ఉండి వీడియో కాల్ చేసి మీ మొబైల్ నంబర్ స్కీన్ షేర్ చేయండంటూ సూచించారు. మీ కేసు మూసేసే ముందు సైబర్‌క్రైమ్‌కు సంబంధించిన కేసులను పరిశీలిస్తామంటూ చెబుతూ దీపాక బర్మాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ మీకు సంబంధముందని, మీ ఆధార్‌తో బ్యాంకు ఖాతా ఓపెన్ అయ్యిందని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉందంటూ భయపెట్టించారు.
ఇలా ఫిబ్రవరి 7తేదీ నుంచి మూడు రోజుల పాటు వీడియో కాల్స్ మాట్లాడారు. మీపై కోర్టు అర్డర్ ఉందని, డీసీపీ అజయ్‌కుమార్ పాటిల్ ఎదుట మీరు హాజరుకావాలంటూ ఆయనతో వీడియో కాల్స్ మాట్లాడారు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదని మీపై విచారణ జరుగుతుందని ప్రతి రోజూ 7 గంటలకు మీరు వీడియో కాల్లో నా ముందు హాజరుకావాలని, ఉదయం 9 గంటలకు వాట్సాప్‌లో మీరు అటెండన్స్ పంపించాలంటూ షరతు విధించారు. ఫిబ్రవరి 10న ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు వీడియో కాల్లో విచారణ పేరుతో బెదిరించారు.
సీబీఐ లోగోలు వెనుక పెట్టుకొని వీడియో కాల్స్‌లో సైబర్‌నేరగాళ్లు విచారిస్తూ నెమ్మదిగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు అర్డర్ ఉందని మీరు రూ. 60 లక్షలు చెల్లించాలని, విచారణ తరువాత తిరిగి మీ ఖాతాలోకి బదిలీ అవుతాయంటూ నమ్మించారు. మీరు ఈ డబ్బు చెల్లిస్తే మార్చి 1వ తేదీ వరకు కేసు క్లోజ్ అవుతుందని నమ్మించారు. ఇలా మార్చి 20వ తేదీ వరకు కేసు విచారణ పేరుతో రూ. 67 లక్షలు సైబర్ నేరగాళ్లు బాధితురాలి వద్ద కాజేశారు.
తనలోనే ఈ విషయాన్ని దాచుకొని భయపడుతున్న ఆమె తన తోటి ఉద్యోగి, బ్యాంక్ మేనేజర్లతో ఈ విషయాన్ని చర్చించడంతో ఇదంతా మోసమని పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. ఆమె ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇప్పటికే డిజిటల్ అరెస్ట్‌లపై రాచకొండ పోలీసులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజమైన పోలీసులు ఎవరూ డబ్బులు అడగరు.. మనీలాండరింగ్, డ్రగ్స్, అక్రమ లావాదేవీలు చేశారంటూ.. ఆరోపణలు చేస్తూ ఆధార్, ప్యాన్ వివరాలు తీసుకోవడం, వాటి గురించి ఆరా తీసి కేసు మాఫీ చేయాలంటే డబ్బులు చెల్లించాలంటూ మాయమా టలు చెబుతుంటారు.. అలాంటి మాటలు నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.