బొల్లారం, ఏప్రిల్ 29: ‘ఒరిగామి’ అంటే కాగితాన్ని మడతలు చేసి వివిధ ఆకృతులు, చిత్రాలు తయారు చేసే ఒక కళ. ఈ కళతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల హోల్డర్ రవి కుమార్ తోలేటి (Ravi Kumar Toleti) అద్భుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని తయారు చేశారు. ఈ చిత్రాన్ని మంగళవారం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కళాఖండం 7.5 అడుగులు, 12 అడుగుల పరిమాణంలో ఉంది. ఈ చిత్రాన్ని 40,500 పైగా మడతలతో అత్యంత జాగ్రత్తగా తయారు చేశారు. దీనిని తయారు చేయడానికి నాలుగేళ్ల పట్టింది. ఈ సందర్భంగా రవికుమార్‌ను పీఎం శ్రీ కేవీ తిరుమలగిరి, పీజీటీ కెమిస్ట్రీ, కే. లలితకళ సుశీంద్రన్ సత్కరించారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ.. ఇది ప్రాచీన కళ, కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన సాంకేతిక సాధనంగా మారిందన్నారు. ఒకప్పుడు సృజనాత్మక వినోదంగా మాత్రమే పరిగణించే వారు. ఈ కళ ఇప్పుడు గణితం, ఇంటీరియర్ డిజైన్, ఫిజికల్ థెరపీ వంటి రంగాల్లో ప్రాథమిక సాధనంగా మారిందని చెప్పారు. ఆధునిక యుగంలో అంతరిక్ష అన్వేషణ, యాంత్రిక ఇంజినీరింగ్, వైద్య శాస్త్రం తదితర రంగాలకు విస్తరించిందని తెలిపారు. ఇది కేవలం కళ మాత్రమే కాదని, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల సమ్మేళన అని పేర్కొన్నారు. కాగితం మడతలతో ఉన్న ఈ కళ మనుషుల ప్రతిభకు సాక్షిగా నిలిచిందని వెల్లడించారు.
ఈ కళాకృతిని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ గోడలపై చూడాలన్నది తన కల అన్నారు. 2002లో ఈ ఆలోచన మొదలు పెట్టానన్నారు. 2021లో దీనిని నిజం చేయడానికి ముందుకు వచ్చానన్నారు. గత నాలుగేళ్లగా స్కూల్ తర్వాత, సెలవుల సమయంలో, సెలవు రోజుల్లో ఈ స్వప్నాన్ని సాకారం చేసేందుకు శ్రమించానన్నారు. ఇది చాలా కఠినమైన దారి అని, అయితే శ్రీ వేంకటేశ్వర స్వామిపైన ఉన్న భక్తి నడిపించిందని తెలిపారు.
రవి కుమార్ తోలేటి.. కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ ఒరిగామి కళపై 1988 నుంచి మక్కువ పెంచుకున్నారు. విద్యార్థులు తమ ఆలోచనలు సృజనాత్మకంగా వ్యక్తం చేయటానికి, ప్రాజెక్ట్ పనులు సమర్థవంతంగా చేసేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో ప్రముఖ ఒరిగామి కళాకారుడు పాల్ జాక్సన్ రాసిన పుస్తకం ఆయనకు మార్గదర్శకంగా నిలిచింది. దీంతో ఈ క్లిష్టమైన కళారూపంలోకి ఆయన ప్రయాణం ప్రారంభమైంది. త్వరలోనే ఈ కళలో ప్రావీణ్యం సంపాదించగలిగారు. ఆయన తన ఇంటి కోసం రూపొందించిన మొట్టమొదటి ఓరిగామి పోస్టర్ 32 సంవత్సరాల తర్వాత కూడా పరిపూర్ణంగా భద్రపరచబడింది. ఆయనకు లభించిన ప్రశంసలు విద్యార్థుల విద్యా ప్రాజెక్టులలో ఓరిగామిని చేర్చడానికి ప్రేరణ ఇచ్చాయి.
ఒరిగామి కళను ఒక సాధనంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, అర్థం చేసుకోవడానికి కష్టమైన గణిత, విజ్ఞాన భావనలను సులభంగా గ్రహించడానికి ఆయన ‘ఒరిగామి ద్వారా గణితం – రవికుమార్ తోలేటి తన ప్రాజెక్టులు, ప్రదర్శనల వీడియోలను ప్రదర్శించడానికి ఒక వేదికగా మాత్రమే కాకుండా.. విద్యార్థులకు పాఠ్యాంశంతో సంబంధించిన డీఐవై మోడళ్లు తయారు చేయడానికి సహాయం చేసింది. రవి కుమార్ తోలేటి 1995 నుంచి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కోసం మాస్టర్ రిసోర్స్ పర్సన్ గా పని చేస్తున్నారు. ఈ కాలంలో ఆయన చేసిన కృషికి అనేక అవార్డులు దక్కాయి. వాటిలో ఎన్సీఈఆర్టీ నుంచి ఇన్నోవేషన్స్ అవార్డు (2002), కేవీఎస్ ప్రోత్సాహక అవార్డు (2004), ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డ్ ఫర్ టీచర్స్ ప్రెసిడెంట్ అవార్డు (2005), కేవీఎస్ నేషనల్ ఇన్నోవేషన్స్ అవార్డులు (2012, 2019) ఉన్నాయి. ఆయన అద్భుతమైన సాధనలలో 2022లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్, అతి పెద్ద ఒరిగామి పీకాక్ ప్రదర్శన కూడా ఉంది. రవి కుమార్ తోలేటి భారతీయ శాస్త్ర రచన సంఘం, ఎన్సీఈఆర్టీకు పత్రాలు సమర్పించారు. 2007, 2008, 2009లో దేశస్థాయి ఒరిగామి ప్రదర్శనలను క్యూరేట్ చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా ఆర్ట్ ఫారమ్‌ను ప్రోత్సహించారు.