హిమాయత్‌నగర్,జూన్ 5: చేతిలో డబ్బులు ఉంటే విలాసవంతమైన జీవితం గడపవచ్చని పన్నాగం పన్ని.. ఓ సంస్థకు సంబంధించిన నగదును కాజేసిన తండ్రి, కొడుకు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం నారాయణగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డీఎస్సై వెంకటేశ్ కేసు వివరాలను వెల్లడించారు. దమ్మాయిగూడకు చెందిన మహ్మద్ రహీం పాషా(25), మహ్మద్ యాకూబ్(55) తండ్రీ కొడుకులు. శాలిబండ బ్రాంచ్ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ డబ్బులు తరలించే వాహనానికి మహ్మద్ రహీంపాషా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ వివిధ సంస్థల నుంచి డబ్బును సేకరించి, వారి వారి అకౌంట్లలో కమీషన్ పద్ధతిపై డిపాజిట్లు చేస్తున్నది. ఇటీవల హిమాయత్‌నగర్‌లోని మలబర్ గోల్డ్ షాప్‌లో డబ్బులు తీసుకునేందుకు ఆ సంస్థ ఉద్యోగులు పవన్‌కుమార్, నిఖిల్‌తో కలిసి రహీంపాషా వచ్చాడు.
తండ్రీ కొడుకు ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగులు గోల్డ్ షాపులోకి వెళ్లిన తరువాత రూ.5 లక్షల 90వేల నగదును రహీంపాషా తన తండ్రి మహ్మద్ యాకూబ్‌కు ఇచ్చి పంపించి వేశాడు. ఆ సంస్థ నిర్వాహకులు లెక్కించగా నగదులో తేడా రావడంతో సంస్థ ఉద్యోగులైన పవన్‌కుమార్, నిఖిల్‌ను ప్రశ్నించారు. అయితే, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వాహన డ్రైవర్ మహ్మద్ రహీం విధులకు హాజరుకాలేదు. అనుమానంతో సంస్థ హెడ్ పిల్లి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. డ్రైవర్ మహ్మద్ రహీం డబ్బులను కాజేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో డ్రైవర్ మహ్మద్ రహీంతో పాటు మహ్మద్ యాకూబ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల 30వేల నగదును స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ వెల్లడించారు.