స్టోర్స్‌లో విద్యుత్ సామగ్రి లేదు.. కావాల్సిన పరికరాలు దొరకడం లేదు..ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదు.. స్థానికంగా పనులు చేయాలంటే సెక్షన్ కాంట్రాక్టర్లకు కావాల్సిన సామగ్రి సైతం అందుబాటులో ఉండడం లేదు.. ఇది ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్ స్టోర్స్‌లో ఉన్న ప్రధాన సమస్య. మరోవైపు క్షేత్రస్థాయిలో సాంకేతిక వైఫల్యం నిండుప్రాణాలను బలితీసుకుంటున్నది. పదిరోజులుగా విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందినా డిస్కం అధికారుల్లో మాత్రం చలనం లేదు.
– సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ)
దక్షిణ డిస్కం పరిధిలో అవినీతిని నిరోధించడానికి ఎస్టిమేట్ల స్థానంలో యూఎల్ఎస్ చార్జెస్ ప్రవేశపెట్టారు. అయితే కొందరు ఇంజినీర్లు ఈ యూఎల్సీ చార్జెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించి మళ్లీ వారితో పనిచేయించడం, మెటీరియల్ కోసం స్టోర్స్‌కు వెళ్తే సామగ్రి దొరకకపోవడం సమస్యగా మారుతున్నదన్నారు. వర్షాకాలానికి ముందు చెట్ల కొమ్మలు నరకడం, లూజ్ వైర్లను సరిచేయడం వంటివి చేయాల్సిన ఉన్నా.. ఆ పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో వినియోగదారులకు ఇబ్బంది కాకుండా ఇప్పుడే ఈ పనులు మొదలుపెట్టామంటూ సీఎండీ చెప్పడంపై విద్యుత్ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హైవోల్టేజీ లైను తెగి కారుపై పడి నిండు ప్రాణాలు పోయినా.. విద్యుత్ శాఖ స్పందించడం లేదు. ఒకవేళ విద్యుత్‌షాక్‌తో చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వస్తే పరిహారం ఇస్తామంటూ సీఎండీ జితేశ్ వీ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాధిత కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. సాధారణంగా విద్యుత్ లైన్ తెగి కిందపడినప్పుడు లేదా భూమికి తగిలినప్పుడు విద్యుత్ ప్రవాహం పెరిగి సబ్‌స్టేషన్‌లోని సర్క్యూట్ బ్రేకర్లు కానీ, స్థానిక ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉండే ఎంసీబీ లేదా ప్యూజులు కానీ ట్రిప్పవాలి. కానీ అలా జరగలేదు. దానికి కారణంగా విద్యుత్ తీగ నేరుగా కారుపై పడిందంటూ.. అధికారులు చెబుతున్నారు. తెగి పడిన వెంటనే కారుపై పడి అక్కడ నుంచి నేలపై పడిన వైరుకు సంబంధించి ఫ్యూజ్ పోవాలి కానీ ఎర్తింగ్ రాకపోవడం వల్ల ఫ్యూజ్ ఆఫ్ కాలేదని, దాంతో తమకు సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ సరఫరాను నిలిపివేశామని సంబంధిత సర్కిల్ అధికారులు చెప్పారు.
ఇటీవల నగరంలో రెండు తీవ్ర ఘటనలు జరిగి నాలుగు ప్రాణాలు పోయిన తర్వాత టీజీఎస్పీడీసీఎల్ కొంత మేలుకుంది. చెట్ల కొమ్మల తొలగింపు, స్తంభాల పునరుద్ధరణ, లూజ్వైర్ల సవరణ వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ చెప్పారు. ఇదిలా ఉంటే వర్షాకాలం మొదలైన తర్వాత సన్నద్ధతకు సంబంధించిన పరికరాల కొనుగోళ్లు చేయడంపై విమర్శలొస్తున్నాయి. కాగా, క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం తాము పనులు చేయడానికి అవసరమైన సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సెక్షన్‌కు 25 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం పదిమందే ఉండడంతో సిబ్బంది కూడా సరిపోక ఒక్కొక్కరం అన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నామని చెప్పారు.