బాలానగర్, మే 26: ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్వోబీకి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆర్వోబీ పక్కనే మరో వంతెన నిర్మాణానికి అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన కూడా చేశారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోబీని పట్టించుకోకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు వ్యక్తులు ఆర్వోబీ పైనుంచి మెట్లమార్గం ద్వారా కిందకు దిగుతూ ఉండగా పెచ్చులూడి ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రభుత్వం ఫతేనగర్ వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మరమ్మతులు చేయించాలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫతేనగర్ ఆర్వోబీకి పలుమార్లు మరమ్మతులు చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్వోబీని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రజల ఇబ్బందులను గమనించి తక్షణమే మరమ్మత్తులు చేయించాలి.