బంజారాహిల్స్, ఫిబ్రవరి 12 : బంజారాహిల్స్ డివిజన్లోని ఎన్బీటీనగర్లో వీడీసీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులను ఇటీవల నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్‌వద్ద నుంచి ఎంపీ కేశవరావు నివాసం మీదుగా మిథిలానగర్ రోడ్డుదాకా రూ.1.60 కోట్ల వ్యయంతో పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా పనులు పూర్తి కావడంతో క్యూరింగ్ నడుస్తున్నది. ఇదే ప్యాకేజీలో భాగంగా కేశవరావు నివాసం చౌరస్తా నుంచి ఎన్బీటీనగర్ ఇండోర్ స్టేడియం దాకా పనులను ప్రారంభించాల్సి ఉన్నది. మొదటి ప్యాకేజ్ పనులు పూర్తయిన వెంటనే ఎన్బీటీనగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఎన్బీటీనగర్ బస్తీ, ప్రభుత్వ పాఠశాల మీదుగా ఎమ్మెల్యే కాలనీలోని ఏసీపీ కార్యాలయం మెయిన్ రోడ్డు దాకా రూ.1.80 కోట్ల వ్యయంతో వీడీసీసీ నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు కావడంతోపాటు టెండర్లు ఖరారయ్యాయి. మొదటి ప్యాకేజీ పనులు పూర్తయిన వెంటనే రెండో దశ పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అత్యంత రద్దీ కలిగిన ప్రాంతం కావడంతో ముందుగానే ట్రాఫిక్ అనుమతులు తీసుకోవడంతోపాటు కొంచెం కొంచెంగా పనులు చేయాల్సి ఉంటుందని, దీని కోసం సరైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం
బంజారాహిల్స్ డివిజన్లో అత్యంత ప్రధానమైన ఎన్బీటీనగర్లో వీడీసీసీ రోడ్డు పనులు రెండు దశల్లో చేస్తున్నాం. ఇప్పటికే తొలిదశ పనులు ముగింపునకు వచ్చాయి. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయి. ఇవి పూర్తయిన తర్వాత ఇండోర్ స్టేడియం నుంచి ఏసీబీ కార్యాలయం దాకా పనులను ప్రారంభిస్తాం. డివిజన్ పరిధిలో సీవరేజీ లైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం.
– విజయ్‌కుమార్, ఈఈ, జీహెచ్ఎంసీ సర్కిల్-18