హైదరాబాద్: దుస్తులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్‌కు (Fashion Designer) షాకింగ్ అనుభవం ఎదురైంది. షాపు ముందు కారు ఆపి.. బట్టలు కొని వచ్చేలోపు తన వాహనం టైర్లు ధ్వంసమై ఉన్నాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీశారని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.12లో నివసించే ఫ్యాషన్ డిజైనర్ జీ.కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ర్యాన్‌గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్‌కు వచ్చారు. తన కారును స్టోర్ ముందు పార్కింగ్ చేసి.. అందులోకి కాకుండా మరో షాపులోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. అయితే కారు స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతిని కనిపించాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీసినట్లు గుర్తించారు. దీంతో స్టోర్ యజమానికి ఫిర్యాదు చేయగా అతడు అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.