మేడ్చల్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సహకార బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతూనే ఉన్నారు. సహకార సంఘాలకు వచ్చే రైతులను బ్యాంకు సిబ్బంది సముదాయించలేకపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తొమ్మిది సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడికి వస్తున్న రైతులకు అర్హుల జాబితాను మళ్లీ పంపించాం.. అంత వరకే మాకు తెలుసు.. రుణమాఫీ వచ్చేది రానిది మాకు ఎలాంటి సమాచారం లేదని రైతులకు చెబుతూ.. బ్యాంకు సిబ్బంది తిప్పి పంపుతున్నారు. అసలు రుణమాఫీ వస్తుందా? లేదా? ఇలా ఎన్ని రోజులు సహకార సంఘాల చుట్టూ తిరగాలని బ్యాంకు సిబ్బందిని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రుణమాఫీ పొందేందుకు అసలు అర్హులు ఎవరంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయం చేసే రైతులు అర్హులు కారా? రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను ఎందుకు మోసం చేస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల పైచిలుకు మంది పంట రుణాలు తీసుకుంటే మూడు విడతలలో 3,432 మంది రైతులకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
బౌరంపేట్‌లో 632 మంది రైతులకు గాను 14 మందికి, దూలపల్లిలో 615 మంది రైతులకు గాను 51 మందికి రుణమాఫీ అయ్యింది. కాగా, పూడూర్, ఘట్కేసర్, అల్వాల్ సహకార సంఘాల్లో రుణమాఫీని పెండింగులోనే ఉంచారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
రుణమాఫీ కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. మాకు రెండెకరాల భూమి ఉంది. సాగు కోసం పంట రుణం రూ. 60 వేలు తీసుకున్నాం. రుణమాఫీ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. అసలు రుణమాఫీ చేస్తారా? లేదా? బ్యాంకు సిబ్బంది చెప్పాలి. రుణమాఫీ వస్తుంది రేపు మాపు అంటూ తిప్పుతున్నారు.