Runa Mafi | మేడ్చల్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు. రుణమాఫీ పొందని రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు వేలాది మందికి రుణమాఫీ కాలేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
రుణమాఫీ పొందని వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో నేరుగా దరఖాస్తులు చేసుకున్నా ఫలి తం లేకుండా పోయింది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ.. రుణమాఫీ చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీపై ఆశలు వదులుకుంటున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రుణమాఫీ పొందే రైతులు 26 వేల పైచిలుకు ఉంటే రుణమాఫీ అయింది మాత్రం 3,642 మందికే. రుణమాఫీ పొందని రైతుల వివరాలను సహకార సంఘాల్లో సేకరించి నివేదికలను ప్రభుత్వానికి పంపించగా, ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించిన సమాచారం రాలేదని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీపై సహకార సంఘాల చుట్టూ తిరిగినా.. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
అసలు రుణమాఫీ చేస్తారా లేదా అనే విషయమై ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అన్నదాతలందరికీ రుణమాఫీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడేమో సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం మరోసారి రైతులను మోసం చేసినట్లే అవుతుందంటున్నారు