అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడలో పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్‌ను సైతం రెడీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆతర్వాత చేపట్టాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పాటును పక్కనబెట్టింది. పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపిన ఫైల్ సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నది. దీంతో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా రూపుదిద్దుకోవాల్సిన కొహెడ పండ్ల మార్కెట్ కలగానే మిగిలిపోతున్నది. ప్రస్తుతం మార్కెట్ నడుస్తున్న బాట సింగారంలో ప్రైవేటు స్థలాలకు నెలనెలా రూ.70లక్షల అద్దెను చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం భారంగా భావించడం లేదు. సరికదా.. ఖాతాలో రూ.314కోట్లు మూలుగుతున్నప్పటికీ మార్కెట్ ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తుండడంతో అటు రైతుల నుంచి ఇటు వ్యాపారుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– రంగారెడ్డి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)
గడ్డిఅన్నారం టూ బాట సింగారం..
ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గడ్డి అన్నారంలోని పండ్ల మార్కెట్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్కు పక్కనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు మూడేండ్ల కింద కొహెడలో తాత్కాలికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయగా.. రేకుల షెడ్లన్నీ గాలి దుమారానికి కూలిపోయాయి. దీంతో కొహెడకు చేరువలోనే ఉన్న బాట సింగారంలోని హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్క్‌కు తరలించారు. 2021 అక్టోబర్ నుంచి బాట సింగారంలోనే పండ్ల మార్కెట్ కొనసాగుతున్నది.
సకల హంగులతో నిర్మించేలా ప్రణాళిక..
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచేలా కొహెడ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రముఖ మార్కెట్లయిన న్యూఢిల్లీలోని అజాద్ పూర్, ముంబయిలోని వాసి, గుజరాత్‌లోని రాజ్‌కోట్, బరుదా మార్కెట్లను సందర్శించి నమూనాను రూపొందించారు. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్లకు దుకాణాలు, 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 11.76 ఎకరాల్లో పండ్ల ఎగుమతులకు ఎక్స్‌పోర్టు జోన్, 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు.
రూ.400కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించి గత ప్రభుత్వంలోనే డీపీఆర్‌ను సైతం సిద్ధం చేశారు. ఓఆర్ఆర్కు, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో కొహెడ ప్రాంతాన్ని అప్పటి ప్రభుత్వం ఎంచుకోగా.. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం ముందు చూపుతో డీపీఆర్‌ను రూపొందించింది. ఆతర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ ఏర్పాటును పట్టించుకోకపోవడంతో ఒక్క అడుగు సైతం ముందుకు పడలేదు.
నిధులు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం..
బాట సింగారంలో తాత్కాలికంగా 44 ఎకరాల్లో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి హెచ్ఎండీఏతోపాటు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన స్థలాలను అద్దెకు తీసుకున్నారు. వాటిల్లో కోల్డ్ స్టోరేజ్‌లు, గోడౌన్లతోపాటు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి మార్కెట్‌ను నమ్ముకునే 306 మంది లైసెన్స్డ్ కమీషన్ ఏజెంట్లు పని చేస్తున్నారు. నిత్యం ఇక్కడి మార్కెట్‌కు తెలుగు రాష్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్టాల నుంచి వివిధ రకాల పండ్లు వస్తుంటాయి.
రంజాన్ మాసంలో ముంబయి నుంచి ఖర్జూర భారీగా ఇక్కడకు దిగుమతి అవుతున్నది. వేసవిలో రికార్డు స్థాయిలో మామిడి పండ్ల విక్రయాలు జరుగుతాయి. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచే పండ్ల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఇక్కడి పండ్ల మార్కెట్లో రూ.1500కోట్ల టర్నోవర్ జరుగుతున్నది. ఈ క్రమంలో మార్కెట్‌కు ఆదాయం సైతం బాగానే వస్తుండగా.. వచ్చిన ఆదాయం పూర్తిగా అద్దెలకే సరిపోతున్నది. ప్రతి నెలా అద్దె రూపంలో స్థలాల యజమానులకు రూ.70లక్షల వరకు చెల్లిస్తున్నారు. గత మూడేండ్లలోనే రూ.22కోట్లను అద్దె రూపంలో చెల్లించినట్లు తెలిసింది.
శాశ్వత ప్రాతిపదికన కొహెడలో మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిగులుబాటు కలుగనుండగా.. ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయడం లేదు. మరోపక్క కొహెడలో మార్కెట్ నిర్మాణం కోసం వివిధ మార్కెట్ల నుంచి సేకరించిన రుణం డబ్బులు సైతం ఫ్రూట్ మార్కెట్ అకౌంట్లో మూలుగుతున్నాయి. 65 మార్కెట్ కమిటీల నుంచి రూ.314కోట్ల రుణాన్ని తీసుకుని ఖాతాలో జమ చేశారు. మార్కెట్ నిర్మాణానికి పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపగా.. సంబంధిత ఫైల్ సీఎం వద్ద నెలల తరబడిగా పెండింగ్‌లోనే ఉన్నది.
నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కదలికలు లేకపోవడం వల్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని చుట్టుపక్కల ఉన్న పూలు, కూరగాయలు, ఉల్లిగడ్డలకు సంబంధించిన మార్కెట్లను సైతం ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని చెప్పారు.