సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): నగరంలో మరోసారి పెద్దఎత్తున నకిలీ మద్యం మాఫియా బట్టబయలైంది. ఖరీదైన మద్యం సీసాల్లో కల్తీ మద్యం నింపి విందులు, వినోదాలకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ ఈఎస్ కృష్ణప్రియ కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యం నింపి, మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ముఖ్యంగా ఈవెంట్లు, ఫామ్‌హౌస్‌లు, ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే విందులకు ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు ఈ ముఠా మద్యం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని, బుధవారం కారులో బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లను తరలించారు.
సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తన బృందంతో కలిసి నిందితులను పట్టుకుని విచారించగా.. నకిలీ మద్యం గుట్టు రైట్టెంది. దీంతో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20లక్షల విలువజేసే బ్లాక్‌లేబుల్ 72 మద్యం బాటిళ్లు, కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, నకిలీ మద్యం పట్టుకున్న డీటీఎఫ్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐశ్రీకాంత్రెడ్డి, సిబ్బంది ఫారూఖుద్దీన్, గణేశ్, నెహ్రూ, సాయి శంకర్లను ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిమ్, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ క్రిష్ణ ప్రియలు అభినందించారు.
ఎంఆర్పీ ధర కంటే తకువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటే అనుమానించాలని శంషాబాద్ ఈఎస్ కృష్ణప్రియ సూచించారు. మిలిటరీ క్యాంటీన్లు మినహా మద్యం ధరలను ఇతరులెవ్వరూ ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉండదని తెలిపారు. ఎవరైనా తక్కువ ధరలకు విక్రయిస్తున్నారం టే అవి కచ్చితంగా నకిలీ మద్యం అయి ఉంటుందని, అలాంటి వారిపై ఆబ్కారీ అధికారులకు సమాచారం అందించాలన్నారు.