గ్రేటర్లో నకిలీ డాక్టర్లు దడపుట్టిస్తున్నారు. తెల్లకోటు తొడిగి.. స్టెతస్కోప్ వేసుకొని.. దర్జాగా బోర్డులు తగిలించుకొని.. ఏకంగా వైద్యశాలలు, క్లినిక్‌లు నిర్వహిస్తూ.. ఇష్టానుసారం మందులు రాస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసుల సె ్పషల్ డ్రైవ్‌లలో నకిలీ వైద్యుల బండారం బయటపడుతోంది. గతంలో మెడికల్ షాప్‌లలో పనిచేసినవారు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆర్ఎంపీల వద్ద అటెండర్లుగా ఉన్నవాళ్లు, ల్యాబ్ టెక్నీషియన్లు.. పారా మెడికల్ సిబ్బంది, నాటు వైద్యం చేసిన వారు ఇలా కొందరు ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు’ జనరల్ ఫిజిషయన్లుగా..పిల్లల వైద్యలు, చర్మవ్యాధి నిపుణులుగా అవతారం ఎత్తడం విస్మయం కలిగిస్తున్నది. చివరుకు ఎలాంటి డిగ్రీలు లేకున్నా.. కొందరు ఏకంగా 20 ఏండ్ల నుంచి నిరంతరాయంగా క్లినిక్‌లు నడుపుతూ.. రోజుకు 100 మందికిపైగా రోగులకు వైద్యసేవలందిస్తుండటం దిగ్భ్రాంతికర విషయమే. ఎనిమిది నెలల్లో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 90 మంది నకిలీ వైద్యులు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమే. అంతేకాకుండా.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కాంపౌండ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 26 ఏండ్ల ట్యాంక్‌బండ్ వద్ద క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు బయటపడింది. రామంతాపూర్‌లో ఓ వ్యక్తి యోగాలో డిప్లమా చేసి అల్లోపతి క్లినిక్‌ను నడిపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్‌ల వ్యాపారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి అర్హత లేకున్నా కొందరు నకిలీ డాక్టర్లు అమాయక ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లలో నకిలీ వైద్యుల లీలలు బయట పడుతున్నాయి. 8 నెలల్లో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 90 మంది నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. అలాగే సైబరాబాద్‌లోనూ పదుల సంఖ్యలో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో నిర్వహించిన దాడులలోనూ పదుల సంఖ్యలో నకిలీ వైద్యులు అరెస్టయ్యారు.
విద్యా అర్హతలు లేకుండా వైద్య మండలి గుర్తింపు లేకపోయినా దర్జాగా బోర్డులు తగిలించుకొని హాస్పిటల్స్, క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో మెడికల్ షాప్‌లలో పనిచేసినవారు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆర్ఎంపీల వద్ద అటెండర్లుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లు, ల్యాబ్‌లలో పనిచేసిన వారితో పాటు పారామెడికల్ సిబ్బంది, నాటు వైద్యం చేసిన వారు సైతం జనరల్ ఫిజిషియన్లుగా, పిల్లల వైద్య నిపుణులుగా, చర్మ వ్యాధి నిపుణులుగా అవతారం ఎత్తుతున్నారు. చివరకు ఎలాంటి డిగీల్ర లేని కొందరు వ్యక్తులు ఏకంగా 20 ఏండ్ల నుంచి నిరంతరాయంగా క్లినిక్‌లు నడుపుతూ రోజు 100 మందికిపై రోగులకు వైద్య అందిస్తుండడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలతో తరుచు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నకిలీ వైద్యులను పట్టుకుంటున్నారు. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోను ఈ నకిలీ వైద్యులు గత కొన్నేళ్లుగా అమాయక ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఇందులో భాగంగా జనవరి నుంచి ఆగస్టు వరకు నిర్వహించిన ఈ తనిఖీలలో 90 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేశామని మల్కాజిగిరి పోలీస్ అధికారులు చెబుతున్నారు. అలాగే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనూ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో అశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 26 ఏండ్ల నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఓ వ్యక్తి క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు, ఇతడు కాంపౌండర్‌గా పనిచేసి, ఏకంగా క్లినిక్నే నిర్వహిస్తుండడంతో గమనార్హం. రామంతాపూర్‌లో ఓ వ్యక్తి యోగాలో డిప్లమా చేసి అల్లోపతి క్లినిక్‌ను నిర్వహించడం బయట పడింది. ఇలాంటి వాళ్లు కొందరు నకిలీ ఎండీ, ఎంబీబీఎస్, ఆర్ఎంపీ వంటి నకిలీ సర్టిఫికేట్లతో వైద్యులుగా చలమాణి అవుతున్న దిగ్భ్రాంతికర విషయాలు బయట పడ్డాయి. ఈ నకిలీ వైద్యులు కొందరు ఏకంగా పెద్ద ఎత్తున్న దవాఖానాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చాయి.
సాధారణ జ్వరం, జలుబు, కడుపునొప్పి వచ్చే రోగులకు వ్యాధి నిర్ధారణ చేయకుండానే నకిలీలు విచక్షణ రహితంగా స్టెరాయిడ్లు, హైడోస్ యాంటీ బయోటిక్స్, ఇన్సులిన్ రకాలను వాడుస్తున్నట్లు బయటపడింది. దీని వల్ల రోగుల్లో తాత్కాలికంగా ఉపశమనం కల్గినా వారి శరీర ఆవయవాలైన కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపి అవి దెబ్బతింటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో స్లైన్ బాటిళ్లు ఎక్కించడం, సర్టికల్ పరికరాలను మళ్లీ మళ్లీ వాడటం వల్ల రోగులకు తీవ్రమైన ఇన్ఫెషన్లు, బ్లడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని అసలైన వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ ఫీజు అని నమ్మి వెళ్లే నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ల్యాబ్ టెస్ట్‌ల పేరుతో వేల రూపాయల బిల్లులను కూడా కొందరు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రాధమిక చికిత్స చేయడం, వారు చేసే వైద్యంతో ప్రాణపాయ స్థితి చేరగానే వెంటనే ఇతర పెద్ద దవాఖానలకు తీసికెళ్లండంటూ చేతులెత్తేస్తుంటారు. ఆలోపే కొన్నిసార్లు రోగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలుంటాయి. ఇలాంటి నకిలీ వైద్యులు కొన్ని దవాఖానలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ల వద్దకు వచ్చే రోగులను ఆయా దవాఖానాలకు పంపించే హబ్‌లుగా మార్చేస్తున్నారనే విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల నకిలీ వైద్యులకు పెద్ద దవాఖానాల నుంచి కమీషన్లు కూడా వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ వైద్యులతో అమాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతున్నారు.