సిటీబ్యూరో, అగస్టు 16(నమస్తే తెలంగాణ): ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్ దేశంలో రాజకీయంగా పలుకుబడిని సాధించేందుకు.. మన దేశ నకిలీ కరెన్సీని ముద్రించిన వ్యక్తిని రాచకొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. .కెమెరూన్ దేశానికి చెందిన యాంబౌ వాకో మాథురిన్ కెన్యాలో 30 ఏండ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. 2020 ఫిబ్రవరిలో మెడికల్ వీసాపై బెంగళూరుకు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యాపేట వాసి షేక్ రహమత్ గతేడాది అక్టోబర్లో బంగారం వ్యాపారం కోసం కెన్యా వెళ్లాడు. అక్కడ పరిచయమైన ఓ వ్యాపారిని కలిసినప్పుడు తన బంధువు ఇండియాలో ఉన్నాడని.. మీరు అతడిని కలిస్తే బంగారం వ్యాపారంలో సహాయం చేస్తాడని సూచించాడు.
నాలుగు నెలల తర్వాత ఇండియాకు వచ్చిన షేక్ రహమత్ .. బెంగళూరులో ఉంటున్న మాథురిన్ని కలిశాడు. అతడు 2 వేల రూపాయల నోట్లను నకిలీవిగా తయారు చేస్తున్నాడని తెలుసుకుని వాటిని చలామణి చేద్దామని ఇద్దరు పథకం వేశారు. ఖమ్మంలో మారుద్దామని ప్రయత్నించారు. ఆ తర్వాత హైదరాబాద్లో చలామణి చేద్దామని నిర్ణయించుకుని ఆదివారం రాత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్కు బస్సులో బయలుదేరారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రామోజీ ఫిలిం సిటీ వద్ద వీరిద్దరిని అదుపులోకి తీసుకుని సోదాలు జరుపగా, సుమారు 10 లక్షల నకిలీ కరెన్సీ దొరకడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
సదరు కెమెరూన్ వాసి తన దేశంలో రాజకీయాల్లో కీలకంగా రాణించడంతో పాటు అక్కడి చట్టసభల్లో పోటీ చేసి గెలిచేందుకు ఇండియాలో నకిలీ కరెన్సీని తయారు చేసినట్లు తెలిసింది. ఆ నోట్లను వీడియోలు, ఫొటోలను తీసి తన దేశంలో ఉన్న అనుచరులకు పంపించి ఇండియాలో తాను భారీగా సంపాదిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నట్లు సమాచారం. చివరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో నకిలీ నోట్లను చలామణి చేద్దామని పోయి.. పోలీసులకు చిక్కాడు.