Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మంత్రాలు, చేతబడితో మీ సమస్యలను పరిష్కరిస్తానంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ బాబాను సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బహుదూర్‌పురా, హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖలీమ్ అలియాస్ మహ్మద్ ఖలీమ్ వృత్తిరీత్యా వాల్ పెయింటర్.
బాబా వేషం వేసి మంత్ర , తంత్రాలు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తానంటూ అమాయకులను నమ్మిస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు, ఇతడిపై గతంలో కాలపత్తార్ ఠాణాలో రౌడీషీట్ నమోదైంది. కాగా ఇతడి గూర్చి తెలుసుకున్న నజియా అనే ఒక మహిళా నకలీ బాబాను ఆశ్రయించి తన అత్త , మామలకు చెందిన ఇర్ఫాన్ కుటుంబంపై మంత్ర, తంత్రాలను ప్రయోగించి వాళ్లను తొలగించుకోవాలని కోరింది.
వారిపై తన మంత్రం ప్రయోగిస్తే వారి పని అయిపోతుదంటూ వాళ్ల ఫొటోలు పెట్టి వాటిపై బొమ్మలు ఉంచి కుంకుమ, పసుపు వేసి తన మంత్ర ప్రభావం ఉంటుందంటూ ఆమెకు చెప్పి 48 గంటల్లో వాళ్లు చనిపోతారంటూ నమ్మించాడు. ఈ సంఘటనను వీడియో తీసి వాటిని ఇర్ఫాన్‌కు పంపించి నీ మీద మంత్ర ప్రయోగం చేశాం, చనిపోతున్నావని, నాకు డబ్బులు ఇస్తే మంత్రం వెనక్కి తీసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు బండ్లగూడ ఠాణాలో ఆ వీడియోల ఆధారంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నకిలీ బాబాను అరెస్ట్ చేశారు.