సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సౌత్‌జోన్, సౌత్ఈస్ట్, ఈస్ట్సౌత్, సౌత్‌వెస్ట్, సెంట్రల్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ విభాగాలకు చెందిన ఆయన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సీపీ సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సిబ్బందితో ఆయన చర్చించారు. ఏ, బీ, సీ కేటగిరి పోలీస్స్టేషన్లు, ఆయా ఠాణాలకు మంజూరైన సిబ్బంది సంఖ్య, ఎన్నికల విధుల్లో ఎంత మంది పాల్గొంటున్నారు.. వారి విధులు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్లో నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలించే ఇతర వస్తువులు ఎంత వరకు పట్టుకున్నారు.. ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడక్కెడ చేపడుతున్నారని ఆరా తీశారు.
నాన్‌బెయిలబుల్ వారెంట్ల ఎగ్జిక్యూషన్, బైండోవర్, ఆయుధాల డిపాజిట్, అసాంఘిక శక్తులపై తీసుకుంటున్న చర్యలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, శాంతి భద్రలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోడల్ కోడ్ అప్ కండక్ట్‌ను ప్రతి ఒక్కరూ అమలు చేయాలని, సిబ్బందికి ఉన్న సందేహాలను సీపీ నివృత్తి చేశారు. గత 15 రోజుల్లో పనితీరుపై టాస్క్‌ఫోర్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నగర కమిషనరేట్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు 90 ఫ్లైయింగ్ స్కాడ్‌ను కేటాయించి వారి విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్మాన్, అదనపు సీపీ(ఎస్బీ) విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.