ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 12: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. భావిభారత పౌరులను తయారుచేసే విశ్వవిద్యాలయ అధ్యాపకులు తమ అన్యాయంపై దాదాపు నెలన్నరగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినైట్లెనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో వర్సిటీలో జరిగిన సీఏఎస్ ప్రమోషన్లలో 48 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించారని చెప్పారు. దీనిని నిరసిస్తూ లా కళాశాల ఆవరణలో ఔటా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ.. పైకి ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చామని ఓయూ అధికారులు చెబుతున్నప్పటికీ, కొందరి పట్ల అశ్రితపక్షపాతం, మరికొందరి పట్ల కక్ష సాధింపు అనే కొలమానాన్ని ఓయూ వీసీ అమలు చేశారని ఆరోపించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించడం లేదని గుర్తు చేశారు. ఔటాను చర్చలకు పిలవకపోవడం, నిరసనలపై స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ అధ్యాపక అవార్డు, ఉత్తమ రీసర్చర్ అవార్డు పొందిన వారికి సైతం ప్రమోషన్లు నిరాకరించారని వివరించారు.
కానీ ఎలాంటి పనితీరు లేని కొంత మంది అధ్యాపకులకు మాత్రం ప్రమోషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రిజెక్ట్ చేసిన వారిలో అర్హతలు ఉన్న ప్రతి అధ్యాపకుడికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులకు దీనిపై వినతిపత్రాలు అందజేసినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వెంకటదాస్, వెంకటేశ్వరరావు, సుజాత, అపర్ణ, హెలెన్, గంగాధర్, రమేశ్‌బాబు, రమేశ్, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.