సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఇంకా కార్యరూపంలోకి రాలేదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా నగరవాసులకు అదనపు బోగీలతో మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. అదనపు బోగీల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించిందని, ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఓ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ అంశంలో ప్రభుత్వం మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీనీ ఆదేశించింది లేదు. కొత్త బోగీలను తెచ్చిందీ లేదు.
రద్దీగా ఉండే మార్గాల్లో తొలి దఫా అదనపు బోగీలను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించారు. అమీర్‌పేట, రాయదుర్గం, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, 4 అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణె మెట్రో నుంచి లీజుకు తీసుకునేలా ప్రతిపాదించారు. కాగా, రద్దీకి అనుగుణంగా బోగీలు అందుబాటులో లేకపోవడంతో.. మరో రైలు వచ్చేంత వరకు ప్లాట్‌ఫాంపై ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా బోగీలను పెంచాలనే డిమాండ్ చేస్తున్నా& అటు మెట్రో కానీ, ఎల్ అండ్ టీ కానీ పట్టించుకోవడం లేదు.