దుండిగల్, ఆగస్టు 31 :కాలంచెల్లిన కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న ఓ సూపర్‌మార్కెట్ బండారం బయటపడింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్‌లోని వసంతనగర్‌లో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ అమ్ముతుండగా వినియోగదారులు గుర్తించారు. గణనాధుడిని నిమజ్జనానికి తరలిస్తూ మార్గమధ్యలో శ్రీకృష్ణాగార్డెన్స్ సమీపంలో ఉన్న ‘క్రిష్మార్టు’ సూపర్మార్కెట్లో ఆదివారం రాత్రి భక్తులు వాటర్ బాటిళ్లతోపాటు కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేశారు.
దాహంతో ఉన్న కొందరు అప్పటికే తాగగా, ఒకరిద్దరు యువకులు మాత్రమే బాటిళ్లపై ఉన్న మాన్యూఫాక్షరింగ్, ఎక్స్‌ఫైరీ తేదీలను పరిశీలించి అవాక్కయ్యారు. అప్పటికే గడువు ముగిసినట్లు గుర్తించారు. కొన్ని బాటిళ్ల గడువు ముగిసి 6నెలలు అవుతున్నట్లు తేలడంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని నిలదీశారు. తమకేమి తెలియదని, తమ యజమానిని అడగాలని చెప్పడంతో వినియోగదారులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.
కొద్ది సేపటికి యజయాని సైతం మార్టుకు వచ్చి కూల్‌డ్రింక్స్ ఎక్స్‌ఫైరీ అయిన విషయం తనకు తెలియదని చెప్పడంతో ఆగ్రహించిన వినియోగదారులు.. అటు పోలీసులు, ఇటు పుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సూపర్మార్కెట్లోని రెండు ఫ్రిజ్‌ల్లో కూలింగ్కోసం ఉంచిన వివిధ రకాల కూల్‌డ్రింక్స్, బాదంపాల బాటిళ్లను పరిశీలించగా సగానికిపైగా బాటిళ్లు ఎక్స్‌ఫైర్ అయినట్టుగా గుర్తించారు. పోలీసులు కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.