సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిమ్స్‌లో వివిధ విభాగాల ఓపీ సేవలను మరింత విస్తరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వారంలో మూడు రోజులు ఉన్న ఓపీ పనిదినాలను అన్ని పనిదినాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే వాస్క్యూలర్ విభాగం ఓపీని ఇక నుంచి అన్ని పనిదినాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వెల్లడించారు.
ఈ విభాగానికి సంబంధించి ప్రస్తుతం వారంలో మూడు రోజులు మాత్రమే ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఓపీ రోజున సుమారు 300 నుంచి 400 వరకు రోగులు వస్తుంటారు. దీని వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడమే కాకుండా రోగులకు సైతం నిరీక్షణ తప్పడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రోగుల సౌకర్యార్ధం వాస్క్యూలర్ ఓపీని అన్ని పనిదినాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కాగా, పిడియాట్రిక్ భవనంలో ఇప్పటికే పిడియాట్రిక్ రుమటాలజీ(ఎస్‌ఎల్‌ఈ), అంకాలజీ విభాగంలో హెడ్ అండ్ నెక్ క్లినిక్‌ను ప్రారంభించినట్లు వివరించారు. నిమ్స్‌కు నాలుగు కొత్త విభాగాలు మంజూరైనట్లు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వెల్లడించారు. క్రిటికల్ కేర్ విభాగంలో నాలుగు డీఎం సీట్లు, న్యూరో అనస్తీషియా విభాగంలో నాలుగు డీఎం సీట్లు మంజూరు కావడంతో క్రిటికల్ కేర్, న్యూరో అనస్తీషియా విభాగాలను కొత్తగా ప్రారంభించినట్లు వివరించారు. దీంతో పాటు ఫెల్లోషిప్ కోర్సులు సైతం ప్రారంభమైనట్లు తెలిపారు.