సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయాలపై గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ అధికారులు నగరంలోని వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.50 లక్షల విలువ చేసే 12.785 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన షేక్ సాహెబ్ ఖాన్, మహ్మద్ అలీలు అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్‌గౌడ్ బృందంతో కలిసి ముసారాంబాగ్ మెట్రోస్టేషన్ పరిసరాల్లో షేక్సాహెబ్ ఖాన్ వద్ద నుంచి మహ్మద్‌అలీ గంజాయి తీసుకుంటుండగా నిందితులిద్దరిని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4.5లక్షల విలువ చేసే 9.012కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం కేసును మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
అమీర్‌పేటలో….
గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతానికి చెందిన చుక్కా ఆనంద్ బాబు అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నాడు. ఎస్టీఎఫ్ సీఐ వెంకట్, ఎస్సై శివ తమ సిబ్బందితో కలిసి గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50వేల విలువచేసే కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీర్ పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.