మేడ్చల్, ఆగస్టు24(నమస్తే తెలంగాణ): స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే అర్హులైన వారందరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి 17,203 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వాటిలో ఇప్పటి వరకు 7,456 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లో 15 వేల మంది లబ్ధిదారులకు మొదటి దశలో గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధి చూకూరనుంది. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరూ అర్హులుగా ఉన్నట్లయితే రూ. 3 లక్షలు అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గృహలక్ష్మి పథకం ద్వారా రెండో విడతలో మరో 15 వేల మంది లబ్ధిదారులకు వర్తింపజేయనున్నారు. త్వరలోనే రెండో విడతకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం వర్తింపజేసేలా రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. స్థలం ఉన్న వారందరూ అర్హులైనట్లయితే పథకం వర్తింపజేయాలని ప్రభు త్వం అధికారులకు ఆదేశాలిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.