సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడా సమయం ఉండాలని, క్రీడలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో జరిగిన హైదరాబాద్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నాలుగు రోజులపాటు సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో 2వేల మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.
ఈ పోటీల్లో కార్ హెడ్ క్వార్టర్స్ మొదటి విజేతగా, సీఎస్డబ్ల్యూ, టాస్క్ఫోర్స్ విభాగాల జట్లు రెండో స్థానంలో నిలిచాయని అన్నారు. మరికొన్ని రోజుల్లో స్టేట్ లెవల్ ఛాంపియన్షిప్ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల సమక్షంలో పురుషులు, మహిళలకు 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, గుర్రాల జంపింగ్, పెగ్గింగ్, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో లలితా ఆనంద్, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.