ముషీరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటితో కైవసం చేసుకోబోతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ( MLA Mutha Gopal) ధీమా వ్యక్తం చేశారు. నిత్యం జనం మధ్య ఉండే బీఆర్ఎస్(BRS) అభ్యర్థి పద్మారావు (Padma Rao) ను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించబోతున్నామన్నారు.
ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి బీఆర్ఎస్కు విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలలో చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోలేదని వెల్లడించారు.
ఎంపిగా గెలిపిస్తే స్వంత పార్టీ కార్యకర్తలను దగ్గరకు రానివ్వని, జనం మధ్యకు రాని బీజేపీ అభ్యర్థిపై ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. మరోసారి నగరంలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Election Results) ఫలితం పునరావృతం కాబోతుందని ఆయన వివరించారు. ప్రజలు తప్పని సరిగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, రంజన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.