ఏర్పాట్లపై సమావేశమైన టీఆర్ఎస్ ప్రతినిధులు
ఇది రాష్ట్ర ప్రజల ఇంటి పండుగ: మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గండిమైసమ్మలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కేపీ. వివేకానంద్, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ సభను పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ పార్టీ జెండాలతో గులాబీ మయం చేస్తామని చెప్పారు.
సభను గౌరవంగా నిర్వహిస్తాం: అరికేపూడి గాంధీ, ఎమ్మెల్యే
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను గౌరవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు ఇంటి పార్టీగా భావిస్తున్నారని చెప్పారు.
పండుగలా నిర్వహిస్తాం: బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే
టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ సభను పండుగలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రతి డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించిరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాధించిన ఫలితాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
తెలంగాణ అభివృద్ధి సీఎం ఘనతే : శరత్‌చంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్
రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని తప్ప ఇతర పార్టీలను నమ్మడం లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి జహంగీర్, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష
శంభీపూర్ రాజు, జిల్లా అధ్యక్షుడు
రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్షగా ఉన్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లోకి చేరేవిధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అవిర్భావ సభ రోజున మండలాలు, డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పార్టీ జెండాలను ఎగుర వేయాలని కోరారు.
పార్టీ ఘనతను ప్రజలకు వివరిస్తాం
కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే
పార్టీ ఘనతను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.