బంజారాహిల్స్, ఏప్రిల్ 26 : అభివృద్ధి పేరుతో ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికేస్తారా.. చట్టాన్ని దాటవేస్తూ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఒప్పుకోం.. ప్రజాభిప్రాయం సేకరించకుండా విధ్వంసమా.. అంటూ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్దకు వచ్చే వాకర్లు, పర్యావరణ ప్రేమికులు గళమెత్తారు. హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ అందించే కేబీఆర్ జాతీయ పార్కు చుట్టూ అభివృద్ది పేరుతో వందలాది చెట్లను నరికేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ‘సేవ్ కేబీఆర్ పార్క్’ పేరుతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించిన పర్యావరణ ప్రేమికులు, వాకర్లు పార్కు చుట్టూ ఫ్లైవోర్లు, అండర్‌పాస్‌ల పేరుతో చేపట్టిన ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తుంగలో తొక్కుతూ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోందని, అరుదైన వృక్షాలతో పాటు భారీ ఎత్తున బండరాళ్లను తొలగిస్తూ దశాబ్దాలుగా కాపాడుకుంటున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. హెచ్సిటీ పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్థలంలో 1942 భారీ వృక్షాలు నరికివేస్తున్నామని అధికారికంగా చెబుతున్నారని, అనధికారికంగా మరో 2వేలదాకా చెట్లను నరికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ైకేవలం ఫ్లెఓవర్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్‌ను తగ్గించలేమనే విషయాన్ని గుర్తించడం లేదని, అడ్డగోలుగా చెట్లను నరికేస్తూ భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉండాల్సిన 25నుంచి 30మీటర్లమేర ఉండాలిసిన ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) పరిధిని 3మీటర్లకు తగ్గించడం దారుణమని, కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేతపై 2021నుంచి స్టే ఉన్నప్పటికీ తాజాగా హెచ్సిటీ పేరుతో చెట్లను నరికేస్తున్నారని వారు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేషనల్ పార్కు చూట్టూ భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల పేరుతో లక్షల టన్నుల సిమెంట్‌ను, స్టీల్‌తో కేబీఆర్ పార్కు చుట్టూ గోడలు నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విధ్వంసాన్ని ఆపేయాలి
-విజయ్ ముల్లంగి, సేవ్ కేబీఆర్ ప్రతినిధి
హెచ్సిటీ పేరుతో కేబీఆర్ చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం నగర పర్యావరణానికి పెద్ద ముప్పు. రూ.930కోట్ల ప్రాజెక్టు అని చెబుతున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌లు, డిజైన్లు, సర్వే ప్లాన్లు, పర్యావరణ అనుమతులు ప్రజల ముందు పెట్టలేదు. కేబీఆర్ చుట్టూ ఉన్న వృక్షాల వల్ల నగరంలో వేడి తగ్గుతోంది. భూగర్భ జలాలు రీచార్జి చేస్తున్న ఈ ప్రాంతాన్ని కాంక్రీట్‌తో చుట్టేస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి ఉండదు. వెంటనే ఈ విధ్వంసాన్ని ఆపేయాలి.