సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మీ ఓటుకు మీదే బాధ్యత’ ‘ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకుంటే ఓటు తొలగిపోతుంది.’ గడువులోపు ఫారాలు నింపండి అంటూ ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్లో గందరగోళంగా తయారైంది. ఎన్నికల కమిషన్ అధికారులు, బీఎల్వోల నిర్లక్ష్యంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే సిటీలో సర్ ప్రక్రియ అత్యంత వెనకబడింది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నింపిన ఫారాల డిజిటలైజేషన్లో ఇతర జిల్లాల కంటే మందకొడిగా సాగుతున్నది.
ఈ నేపథ్యంలో బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయకపోవడంతో ఓటర్ల నుంచి స్పందన కరువైంది. ఎక్కడికి వెళ్లి ఫారాలు తీసుకోవాలో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. దీంతో ఇప్పటికీ బీఎల్వోల వద్ద వందల కొద్ది ఎన్యుమరేషన్ ఫారాలు పోగుపడి ఉన్నాయి. గడువు పొడిగించినా సర్ ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో అధికారులు బీఎల్వోలపై ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్వోల తమ బూత్ పరిధిలోని ఓటర్లకు ఫోన్లు చేసి ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
నిబంధనల ప్రకారం బీఎల్వోలు ఇంటికి వచ్చి ఫారాలు పంపిణీ చేయకుండా తమనే వచ్చి తీసుకోమనడమేంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ‘మీ ఓటుకు మీరే బాధ్యులు’. ఫారాలు తీసుకోకుంటే మీ ఓటు తొలగిస్తారు.. ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకుని వివరాలు నింపి ఇవ్వాలి. అని ఆదేశిస్తున్నట్లు ఓటర్లు చెప్తున్నారు. సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పట్టించుకోని బీఎల్వోలు గడువు ముగుస్తుండటంతో ఒత్తిడి చేయడమేంటన్ని ప్రశ్నిస్తున్నారు.
సర్ ప్రక్రియ మరోసారి గడువు పెంచినా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒక్కో బీఎల్వో దగ్గర వందల సంఖ్యలో ఫారాలు మూలుగుతున్నాయి.
అధికారులు ఒత్తడి పెంచినా.. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసినా చలనం లేదు. ఇప్పటికీ నగరంలోని చాలా మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలు ఎక్కడ తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు బీఎల్వోలు పోలింగ్ కేంద్రాలకే పరిమితమవుతుండటంతో ఆయా శాఖల్లో పాలన పడకేసింది.
ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లే ఎక్కువగా ఉండటంతో సేవలు స్తంభించి పోయాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు వెలవెలబోతున్నాయి. ఫారాలు నింపడంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఓటర్లు వెళ్తే పట్టించుకునేవారే కరువయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రేటర్ పరిధిలో గడువు ముగిసినా సర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండదు. ఇప్పటికైనా అధికారులు సర్ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.